Friday, September 12, 2025

కామారెడ్డి కాంగ్రెస్ సభకు వర్షం దెబ్బ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిలకు అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది. అందుకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అనే నామకరణం చేశారు. అయితే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎదురైన సవాళ్ళను వివరించేందుకు కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఇటీవల పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించారు.

Also Read: గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

కాగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేయాలని పార్టీ ముఖ్య నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఈ మేరకు నిర్ణయించారు. సభా ప్రాంగణంలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయగలం కానీ బహిరంగ సభకు వచ్చే ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని వారు భావించారు. పైగా వరదలతో అల్లకల్లోలం అవుతుంటే మరోవైపు కాంగ్రెస్ సభ పేరిట ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందన్న విమర్శలనూ ఎదుర్కొవాల్సి వస్తుందన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాల్సిందిగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు. కామారెడ్డిలో నిర్వహించాలనుకున్న సభకు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీనీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News