Thursday, July 17, 2025

జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలి.. మోడీకి ఖర్గే, రాహుల్ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

పలు వివరణలతో సమగ్ర లేఖ.. చట్టానికి డిమాండ్
పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖ పంపించారు. ఇది హోదా పునరుద్ధరణే అవుతుందని వివరించారు. 21 నుంచి ఆరంభమమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాసంపూర్ణ స్థాయిలో దక్కేలా చేసేందుకు తగు బిల్లు తీసుకువచ్చి, చట్టం రూపొందించాలని ఈ లేఖలో వీరిరువురు తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ ఉన్నారు. బుధవారం వారు పంపించిన లేఖ రాజకీయ వర్గాలలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్టికల్ 370 రద్దు తరువాత జెకె స్వరూపం మారింది. కేంద్ర పాలిత ప్రాంతం అయింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సి ఉంది. లడఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని కూడా ఈ లేఖలో తెలిపారు. ప్రధాని మోడీ ఈ విషయాలలో స్పందించాల్సి ఉందన్నారు.

గడిచిన ఐదేళ్లుగా జమ్మూ కశ్మీర్ ప్రజలకు రాష్ట్ర హోదా లేకుండా పోయింది. అక్కడి జనం ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం స్పందించాల్సి ఉందని, జనాభిప్రాయం మేరకు ఇందుకోసం చట్టం తీసుకురావడమే ప్రధాన అంశం అవుతుందని తెలిపారు. జమ్మూకశ్మీరీల డిమాంవ్‌లో నిజాయితీ ఉంది. పైగా రాష్ట్రహోదా చట్టబద్ధం. వారి రాజ్యాంగ , ప్రజాస్వామిక హక్కుగా రాష్ట్ర హోదా ఉందని తెలిపారు. గతంలో కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్రాల హోదా కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగిందిం. స్వాతంత్య్ర భారతదేశంలో తొలిసారిగా ఓ ప్రాంతం రాష్ట్రప్రతిపత్తిని కుదించి కేంద్ర పాలిత ప్రాంతం (యుటి) చేసేశారని విమర్శించారు. ప్రధాని మోడీ పలు సార్లు రాష్ట్ర హోదా కల్పించడం జరుగుతుందని చెప్పారని, 2024 మే 19న భువనేశ్వర్‌లో జరిగిన సభలో ఈ రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారని, దీనిని తాము గుర్తు చేస్తున్నామని లేఖలో తెలిపారు.

శ్రీనగర్‌లో కూడా మోడీ ఇదేచెప్పారని, పార్లమెంట్‌లో చెప్పినట్లుగానే ఈ హామీ నిలబెట్టుకుంటామని కేంద్రం చివరికి సుప్రీంకోర్టుకు కూడా తెలియచేసుకుందని ఇరువురు నేతలు తెలిపారు. సాధ్యమైనంత వరకూ తొందరల్లోనే పునరుద్ధరణ జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్ ప్రాంతీయుల హక్కులు వారి భూములు, గుర్తింపు, వారి సాంస్కృతిక విశిష్టతల పరిరక్షణకు ప్రత్యేకించి ఈ ప్రాంత సమగ్ర అభివృద్థికి కేంద్రం చర్యలు తీసుకోవల్సి ఉంది. ఇది ఈ యుటిని రాజ్యాంగపు ఆరో షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా సిద్ధిస్తుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కాంగ్రెస్ నేతల లేఖ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో ఈ డిమాండ్‌ను ఖర్గే, రాహుల్ ప్రధానికి తెలియచేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఆయన స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News