కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం, దాని సైద్ధాంతిక భూమిక అయిన ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల ప్రకారం కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తుల అనుకూల పరిపాలన సాగిస్తున్నది.2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అనేక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేయటమేకాకుండా, దానికనుగుణంగా చట్టాలను రూపొందిస్తూ వస్తున్నది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్ని హరించి వస్తువుల, సర్వీసుల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని తీసుకొచ్చారు. జిఎస్‌టి చట్టం మూలమున రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు మున్సిపాలిటీ స్థాయికి దిగజారిపోయాయి. భారత రాజ్యాంగంలో చెప్పిన ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా ఈ చట్టం ఉన్నది.
ఆ తరువాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ), జాతీయ పౌరసత్వ పట్టిక (ఎన్‌ఆర్‌సి) బిల్లును, ఎన్‌పిఆర్ చట్టాలను తీసుకొచ్చింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో కశ్మీర్‌కు ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తి 370, 35ఎ ఆర్టికల్స్‌ను రద్దు చేసింది. భారతదేశంలో ఇస్లాం ఫోబియాను రెచ్చగొట్టి మైనారిటీ ముస్లింలపై దారుణ మారణకాండ జరపటం దాని ఉద్దేశం. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన మరుసటి దినం ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలు డా. బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, భారత రాజ్యాంగంగా మనస్మృతి ఉండాలని, అదే తమ అభిమతమని వారు ఉద్ఘాటించారు.
భారత రాజ్యాంగ ప్రవేశికలో చెప్పినట్లుగా భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాతంత్ర, లౌకిక, గణతంత్ర రాజ్యంగా తాము ఒప్పుకోవటం లేదని వారు అనేక సందర్భాల్లో ఘంటాపథంగా చెప్పారు. ఒకే దేశం, ఒకే ప్రజా, ఒకే చట్టం పేరుతో భారతదేశాన్ని హిందూ దేశంగా లేదా హిందూ రాజ్యంగా ఏర్పడాలని ఆర్‌ఎస్‌ఎస్ ఉద్దేశమని వారు పదేపదే చెప్పారు. పూర్వం ‘జనసంఘ్’ రాజకీయ పార్టీయే నేటి ‘భారతీయ జనతా పార్టీ’. భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పుడు గాంధీ సోషలిజం తమ లక్ష్యం అన్నారు. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం భారత పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరణ చేసే అధికారం ఉన్నదనీ, అయితే పార్లమెంటు చేసే చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వభావానికి లోబడి ఉండాలని, భిన్నంగా ఉండరాదని తీర్పు చెప్పింది.
ఇటీవల ఆ పార్టీ నాయకులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రవేశికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనేటువంటి పదాలు లేవని పదేపదే చెబుతున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే బహిరంగ ప్రకటన కూడా ఇచ్చారు. సుప్రీం కోర్టును కూడా ప్రభావితం చేసి బాబ్రీ మసీదు కేసులో తీర్పు వచ్చిన తీరును మనం చూసాం. అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజని గోగోయ్‌కి రాజ్యసభ సభ్యత్వం, మరో సుప్రీం కోర్టు న్యాయమూర్తి నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి పొందారు. భవిష్యత్తులో భారత రాజ్యాంగం మౌలిక స్వభావాన్ని కూడా పార్లమెంటు మార్చవచ్చు అనే తీర్పు వచ్చినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి హిందూ రాష్ట్ర ఎజెండా ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఆర్‌ఎస్‌ఎస్ హిందుత్వ ఎజెండాకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ వస్తున్నది.
1991లో పివి నరసింహారావు నేతృత్వంలో తీసుకొచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్ పిజి) నయా ఉదారవాద విధానాలు బిజెపి ప్రభుత్వం మరింతగా అమలు చేస్తున్నది. అంబానీ, అదానీ లాంటి ఆశ్రితపక్షపాతులకు, కార్పొరేట్ దిగ్గజాలకు దేశసంపదను అప్పజెప్పటానికి మొత్తం ప్రభుత్వరంగ పరిశ్రమలన్నిటినీ ప్రైవేటీకరణకు పూనుకున్నది. అందుకనుగుణంగా అనేక చట్టాలను మారుస్తూ వస్తున్నది. అందులో భాగంగానే మూడు వ్యవసాయ నల్లచట్టాలను తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నిటిని అంబానీ, అదానీలకు వ్యాపార సరుకుగా చేయటానికి పూనుకున్నది. ప్రధాన నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా ఉంటూ, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా భారతదేశ చట్టాలను మారుస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి.
దీనిని భారతదేశ రైతాంగం, ప్రధానంగా ఉత్తర భారత రైతాంగం ముందు భాగాన నిలబడి దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తిష్ట వేసుకుని ఆ చట్టాలను వెనక్కి తీసుకునేంతవరకు సంవత్సర కాలంపైగా దీర్ఘకాలం పోరాటం చేశారు.ఈ సందర్భంలో రైతు సంఘాలతో చేసుకున్న ఒడంబడికను నేటి వరకు అమలు చేయలేదు. అదే సమయంలో 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను 2020 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నాటినుండి నేటి వరకు కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వాన, వామపక్ష పార్టీల నాయకత్వాన సుదీర్ఘమైన పోరాటంచేస్తూ ఉన్నారు. ఆశ్రితపక్షపాత పెట్టుబడిదారులకు ప్రభుత్వరంగ పరిశ్రమలను, జాతి సంపదను అప్పజెప్పటమే కాకుండా దానికనుగుణంగా గత 100 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేయాలనే దుష్టతలంపుతో 29 చట్టాలను రద్దు పరిచి నాలుగు లేబర్ కోడ్‌లను తయారు చేసింది.
మొదటిది, 2019 వేతనాల కోడ్ అమలులోకి వస్తే జాతీయ కనీస వేతనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు (పేమెంట్ ఆఫ్ వేజెస్)వేతనాలు నిర్ణయించే అధికారాన్ని కోల్పోతాయి. కనీస వేతనాలు (మినిమం వేజెస్) రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అమలయ్యే అవకాశం ఉండదు. ఓవర్ టైం చేసినందుకు కానీ, సమాన పనికి సమాన వేతనం గాని కోరే హక్కును కార్మిక వర్గం కోల్పోతుంది. రెండవది, 2020 పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలులోకి వస్తే సమ్మె హక్కు కోసం కార్మిక వర్గం చాలా కష్టాలు ఎదుర్కోవాలి వస్తుంది. ఈ కోడ్‌లో కార్మికులు సమ్మె చేయటానికి అనేక ఆటంకాలు కల్పించారు. 100 మంది కన్నా తక్కువ మంది కార్మిక సంస్థల్లో పని చేస్తుంటే వారిని పైనుండి తొలగించటం సులభతరం అవుతుంది. పరిశ్రమల్లో కార్మిక సంఘాల ఏర్పాటు కష్టభూయిష్టమవుతుంది.
మూడవది, 2020 వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ వల్ల పది మంది కంటే తక్కువ కార్మికులు పనిచేసే కంపెనీలలో కార్మికుల ప్రాణాలకు భద్రత ఉండదు. కాంట్రాక్ట్ కార్మికులు రక్షణ కోల్పోతారు. గిగ్, ఫ్లాట్, ఫారం, కార్మికుల రక్షణపై సరైన నిబంధనలు రూపొందించలేనందున వారికి రక్షణ కరువవుతుంది. నాల్గవది, 2020 సామాజిక భద్రత కోడ్ అమలులోకి వస్తే ఎవరికైనా ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చే అవకాశం వస్తుంది. అందువల్ల యాజమాన్యం ఇఎస్‌ఐ, పిఎఫ్‌లు, గ్రాడ్యుటి కవరేజ్ లేకుండా ఉంటుంది. కార్మికులకు ఏ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే కోటి మంది పైబడిన స్కీం వర్కర్లకి ఈ కోడ్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది.
- మన్నవ హరిప్రసాద్, 82477 28296