మొత్తం ప్రపంచ సంపద 471 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో సుమారు 16 ట్రిలియన్ డాలర్ల సంపద సుమారు మూడువేల మంది కుబేరుల మధ్య కేంద్రీకృతం కావడం ఆలోచించదగ్గ విషయం. ప్రపంచం మొత్తం లో అమెరికా, చైనా, రష్యాలు 50% బిలియనీర్లను కలిగి ఉన్నాయి. అమెరికా అత్యధిక సంపద 902 మంది బిలియనీర్ల చేతుల్లో ఉంది. చైనాలో 1.7 ట్రిలియన్ డాలర్ల సంపద 450 మంది చేతుల్లో, ఇండియాలో 200 మంది కుబేరుల చేతుల్లో అత్యధిక సంపద కేంద్రీకృతమైనది. కొన్ని గణాంకాల ప్రకారం ప్రపంచంలోని మొత్తం సంపదలో 43 శాతం సంపద కేవలం 1% మంది చేతుల్లో ఉంది. కుబేరుల సంఖ్య పెరుగుతున్నా, ప్రపంచంలో పేదరికం మాత్రం పోవడం లేదు.
ఈనాటికీ ప్రపంచంలో అత్యధిక శాతం మంది అత్యల్ప ఆదాయంతో జీవిస్తూ, జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు లేక చెట్ల క్రింద, ఫుట్‌పాత్‌ల (Under foot paths) మీద, మురికివాడల్లోను అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు. కొన్ని దేశాల ప్రజలు తినడానికి తిండిలేక, తాగడానికి పరిశుభ్రమైన నీరు లేక అలమటిస్తున్నారు. అడ్డదారిలో డబ్బును సంపాదించడం, బినామీల పేరుతో కోట్ల కొలది సంపదను దాచడం, అందరికీ చెందవలసిన సంపద కేవలం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం వంటి చర్యల ద్వారా పేదలు మరింత పేదలుగా, కుబేరులు సంపదలో మరింత శక్తి వంతులుగా తయారు కావడం ప్రపంచంలో జరుగుతున్న దుర్మార్గమైన అవినీతి తతంగంగా పేర్కొనవచ్చు.
తమ తెలివితేటలతో ధనవంతులుగా ఎదగడం ఒక ప్రక్రియ కాగా, అదే తెలివి తేటలతో, మోసంతో, సంపదనంతా ఒకే చోట కేంద్రీకృతం చేసుకోవడం అవినీతికి పరాకాష్ఠ. ప్రపంచ వ్యాప్తంగా ఈ అవినీతి జాడ్యం ఒక మహమ్మారిలా వ్యాపించింది. దీనికి అడ్డుకట్ట వేయడం ప్రస్తుతానికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అవినీతికి, నిష్పాక్షికతకు ప్రతిరూపంగా కఠిన చట్టాలతో అవినీతిని అణచివేసే దేశాలుగా పేరుగాంచిన అమెరికా, చైనాల్లో కూడా అత్యధిక సంపద కేవలం కొద్ది కుటుంబాలకే పరిమితం కావడం ఆయా దేశాల ఆర్థిక డొల్లతనాన్ని ప్రస్ఫుటం చేస్తున్నది. పైగా ఈ దేశాల ఆదాయం స్థిరాస్తుల పెరుగుదలవలన సాధ్యమయింది. ఆస్తుల విలువ పడిపోతే వీటి అర్థిక పతనం తథ్యం. ప్రస్తుత ప్రపంచ ఆదాయంలో అధిక శాతం రియల్ ఎస్టేట్, సాప్ట్‌వేర్ రంగాలనుంచి లభిస్తున్నది.
అమెరికా, చైనా, జపాన్ దేశాలు జిడిపిలో ముందంజలో ఉన్నాయి.మరికొన్ని దేశాలు ఆర్థిక సంక్షోభంతో అట్టుడికిపోతున్నాయి. ఎక్కడైతే సంపద సమానంగా పంచబడుతుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ప్రపంచ జనాభా పెరుగుతున్నది. పెరుగుతున్న జనాభాకు తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రజల తలసరి ఆదాయం పెరగాలి. అప్పుడే ప్రజల జీవన ప్రమాణాల స్థాయి మెరుగుపడుతుంది. ఆర్థిక అవినీతి వలన పేదలు ఇంకా పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా మారిపోతున్నారు. ఆర్థిక అసమానతలు మరింత పెరిగిపోతున్నాయి.
ఇలాంటి పరిణామాలకు మూలకారణం అవినీతి, ఆర్థిక దోపిడీ. ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అడ్డదారులు ఏర్పడుతున్నాయి. తక్కువ వేతనాలతో వెట్టిచాకిరీ చేయించడానికి బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం, మాదక ద్రవ్యాల అక్రమ తయారీ, రవాణా, మహిళలను అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించడం, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ఇలా ఒకటేమిటి ఆర్థికంగా ఎదగడానికి చేసే అనైతిక చర్యలన్నింటినీ వినియోగించుకునే మార్గాలను సుగమం చేసుకోవడానికి చేసే అరాచకాలకు నడుస్తున్న ప్రపంచ చరిత్ర నిలువుటద్దం పడుతున్నది. ఆర్థిక అవినీతి అత్యంత పాపకార్యంగా మారిపోయి, అంతర్జాతీయ సమాజాన్ని శాసిస్తున్నది.
ధనార్జన కోసం సాగే వేటలో సామాన్యులు సమిధలుగా మారిపోతున్నారు. అవినీతి విషవృక్షమై, శాఖోపశాఖలుగా విస్తరించి సామాన్యుల బతుకు ముఖచిత్రాలను తలక్రిందులు చేస్తున్నది. ఇకనైనా ప్రపంచ ఆర్థిక నీతి మారాలి. అభివృద్ధి అంటే అందరికీ కనీస అవసరాలు అందుబాటులోకి రావాలి. అపారమైన సంపద కేవలం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. అవినీతి రహితమైన ధనార్జన, ఆర్థిక ఎదుగుదల ఆహ్వానించదగ్గ పరిణామమే. అవినీతితో సంపన్నులు కావడం ముమ్మాటికీ అవాంఛనీయం. అవినీతి కోట్లాది మంది జీవితాలకు శాపంగా పరిణమిస్తున్నది. అవినీతి పరులను సమాజం క్షమించకూడదు. విలువల విధ్వంస ఫలితంగా ఏర్పడిన ఒక వ్యవస్థీకృత నేరం అవినీతి.
- సుంకవల్లి సత్తిరాజు, 97049 03463