Saturday, July 26, 2025

ఇడి తీరుపై మళ్లీ ‘సుప్రీం’ అసహనం

- Advertisement -
- Advertisement -

పాలకవర్గాలు తమ ప్రత్యర్థులపై పగ సాధించడానికి దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నాయన్న ఆరోపణలు గత కొంతకాలంగా వస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఇడి లేదా సిబిఐ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉంటుందన్న విమర్శలు కొట్టిపారేయడానికి వీలులేదు. ఇదే నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)ని వాడుకుంటున్నారని, ఇడి అధికారులూ అన్ని హద్దులు దాటేస్తున్నారని సుప్రీం కోర్టు సోమవారం (జులై 21న) తీవ్ర అసహనం వ్యక్తం చేయడం పాలకవర్గాల డొల్లతనాన్ని బయటపెట్టడమే. అంతేకాదు రాజకీయాల్లో పావుగా మారవద్దని ఇడికి కోర్టు హెచ్చరించింది. రెండు కేసుల విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిలో ఒకటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య ముడా కేసుకు సంబంధించింది. రెండోది క్లయింట్‌లకు సలహాలు ఇచ్చినందుకు సీనియర్ న్యాయవాదులకు ఇడి సమన్లు జారీ చేసిన కేసు.

కర్ణాటక కేసులో దిగువ కోర్టుతోపాటు హైకోర్టు (Court High Court) కూడా సిద్ధరామయ్య భార్యకు ఉపశమనం కల్పిస్తూ చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ ఇడి అప్పీలు చేయడాన్ని సిజెఐ ప్రశ్నించారు. రాజకీయ యుద్ధాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి కానీ ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? అని ఇడిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. మహారాష్ట్రలోనూ ఇడి నుంచి ఇలాంటి వైఖరినే చూశామని సిజెఐ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఇడిపై మద్రాసు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రాని అంశాలపై ఇడి కేసులు నమోదు చేయడం, ఆస్తులు జప్తు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. పాలకవర్గాల చేతిలో కీలుబొమ్మగా మారి విపక్షపార్టీల నేతలపైనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులు జరుగుతున్నాయని, ఇడి డొల్లతనాన్ని సాక్షాత్తు సుప్రీం కోర్టే గణాంకాల సాక్షిగా ఎండగట్టడం గతంలోనూ జరిగింది.

అయినా ఇడి తీరు మారడం లేదు. బిజెపి పాలనలో సిబిఐ, ఇడి దాడులు విచ్చలవిడిగా సాగుతున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2004లో ఇడి 112 దాడులు మాత్రమే చేయగా, 2022లో ఈ సంఖ్య 3010 కి చేరింది. అంటే 27 రెట్లు పెరిగిందని తెలుసుకోవాలి. మనీలాండరింగ్ కేసుల్లో నమోదవుతున్న వాటిలో ఎక్కువ శాతం శిక్షలే పడటం లేదని, ఈ విషయంలో ఇడి సాక్షాధారాలు సమర్పించడంలో విఫలమవుతోందని సుప్రీం కోర్టు గతంలో తీవ్రంగా మందలించింది. యుపిఎ హయాంలో ఇడి నమోదు చేసిన కేసులు, జప్తు చేసిన ఆస్తులు, ఎన్‌డిఎ ఏలుబడిలో గత కొన్నేళ్లుగా నమోదవుతున్న కేసులు, జప్తులను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. యుపిఎ ప్రభుత్వ హయాంలో (200405 నుంచి 2013 14) ఇడి ఆధ్వర్యంలో కేవలం రూ. 5346 కోట్ల ఆస్తులే జప్తు కాగా, మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి 2022 వరకు రూ. 99,356 కోట్ల విలువైన ఆస్తులు జప్తు అయ్యాయి.

అలాగే ఇడి కేసుల్లో 95 శాతం ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో నమోదైనవే. బిజెపి పాలిత రాష్ట్రాలన్నిటిలోనూ ఎలాంటి దాడులు జరగకపోవడం విస్మయం కలిగిస్తోంది. అంతేకాదు ఇడి విశ్వసనీయతకే ఇది సవాలు. నగదు అక్రమ చెలామణి జరిగిందని ఆరోపిస్తూ దాఖలు చేస్తున్న కేసుల్లో చాలావరకు శిక్షలు పడడం తక్కువేనని సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించడం గమనార్హం. 2014 2024 మధ్యకాలంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద 5297 కేసులు పెట్టగా, వాటిలో 40 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని అప్పటి కేంద్ర హోంశాఖ లోక్‌సభకు తెలియజేసింది. దీన్ని బట్టి ఇడి కేసుల దాఖలు ఎంతవరకు పక్కా సాక్షాలతో ఉంటున్నాయో చెప్పవచ్చు. అలాగే చాలా కేసుల దర్యాప్తులో ఇడి తనకున్న అసాధారణ అధికారాలతో దూకుడుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

దీనిపై ఫిర్యాదులు రావడంతో గతంలో ఒకసారి సుప్రీం కోర్టు మందలించింది కూడా. దర్యాప్తుల సమయంలో భయోత్పాత వాతావరణం సృష్టించవద్దని, అవతలివారిని భయపెడితే మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించింది. దర్యాప్తు కోసం చేసే ప్రయత్నాలను కూడా అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మందలించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఉన్న వారి పేర్లను ఇరికించడానికి అధికారులపై ఒత్తిడులు తీసుకు వచ్చే సంఘటనలు కూడా జరిగాయి. కర్ణాటకలో ఓ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ మంత్రి బి. నాగేంద్ర పేర్లను చేర్చడానికి ఇడి అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని ఇద్దరు ఇడి అధికారులపై ఎఫ్‌ఐర్ కూడా నమోదైంది. ఒక కేసు విషయంలో ఇడి అధికారులు తమను బలవంతంగా సంతకాలు చేయించడానికి వేధించారని చత్తీస్‌గఢ్ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు 52 మంది ఫిర్యాదు చేశారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉండే వ్యక్తులను నియమిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.  వారి పదవీ కాలం పూర్తయినా పొడిగిస్తున్నారని చెబుతున్నారు. 2023లో దీనికి తార్కాణంగా కొన్ని పరిణామాలు జరిగాయి.సంజయ్ కుమార్ మిశ్రా ఇడి డైరెక్టర్‌గా 2018 నవంబర్‌లో నియమితులయ్యారు. రెండేళ్లు పూర్తయిన తరువాత ఆయనను మరో ఏడాది కాలం పొడిగించారు. దానిపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా పొడిగించడానికి వీలు లేదని కోర్టు 2021లో తీర్పు చెప్పింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు. పైగా దీనికి సంబంధించిన చట్టాలనే సవరిస్తూ మిశ్రాకు మూడుసార్లు పదవీ కాలాన్ని పొడిగించింది. రాజుగారు తలచుకుంటే ఇక తిరుగేముంది? ఫలానావారిపై దాడులు చేయాలని కనుసైగలు చేస్తే చాలు వెంటనే జరిగిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News