హైదరాబాద్: చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో (Khazana Jewellery) దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయుధాలతో వచ్చిన దుండగులు.. సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి పరార్ అయ్యారు. అయితే ఈ విషయంపై సైబరాబాద్ సిపి అవినాశ్ మహంతి వివరణ ఇచ్చారు. ఉదయం 10.30 కి ఆరుగురు దుండగులు ఖజానా జెవెల్లెర్స్ షోరూం లోపలికి వచ్చారని.. ఒక దుండగుడు ముందే షోరూంలోకి వచ్చి (రెక్కీ నిర్వహించి) వెళ్ళినట్లుగా సీసీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోంది.. తెలిపారు. తాళం చెవులు ఇవ్వలేదని మేనేజర్ సతీష్‌పై కాల్పుల జరిపారని.. ఒక రౌండ్ సతీష్ శరీరంలోకి.. ఇంకో రౌండ్ షోరూం రూఫ్ లోకి దూసుకెళ్లిందని స్పష్టం చేశారు. సతీష్‌కి ప్రాణాపాయం ఏమీలేదని తెలిపారు.
పది బృందాలు ఏర్పాటు చేసి దుండగులు కోసం గాలింపు చేపట్టామని.. దుండగులు మూడు బైకులపై వచ్చినట్లుగా తెలుస్తోందని అవినాశ్ మహంతి తెలిపారు. ఏడుగురే వచ్చారా.. ఇంకెంతమంది ఉన్నారో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. దుండగులు గతంలో కెపిహెచ్‌బిలో చోరికి పాల్పడిన వారే అని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. పదిన్నరకు షాపు (Khazana Jewellery) లోపలికి ప్రవేశించిన దొంగలు.. 10.45 కు బయటకి వెళ్ళిపోయారని పేర్కొన్నారు. దొంగలు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని.. బంగారు ఆభరణాలు చోరికి గురికాలేదని స్పష్టం చేశారు. దుండగుల వద్ద మూడు తుపాకులు ఉన్నట్లుగా ఖజానా సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోందని అన్నారు.