మనతెలంగాణ/మాదన్నపేట్: హైదరాబాద్ మలక్‌పేట్‌లోని శాలివాహన నగర్ పార్క్ వద్ద సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌ను కొందరూ దుండగులు గన్‌తో కాల్చి చంపడం కలకలం రేపింది. భార్య, కూతురు ముందే ఐదు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ అచ్చంపేటకు చెందిన సీపీఐ నాయకులు గత కొద్ది కాలంగా శాలివాహన నగర్‌లో నివాసముంటున్నారు. ప్రతి రోజూ ఉదయం భార్య నారీ భాయ్, కూతురుతో వాకింగ్ వెళ్లే అలవాటు ఉంది.
యధావిధిగా మంగళవారం ఉదయం 7.30 గంటలకు కుటుంబ సభ్యులతో చుందు నాయక్ శాలివాహన నగర్ పార్క్‌కు చేరుకున్నారు. ఇంతలో ఓ కారులో కొందరూ దుండగులు వచ్చి గన్‌తో ఐదు రౌండులు కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మొత్తం ఐదు రౌండ్లు జరిపిన్నట్లు నిర్థారించి మృతదేహాన్ని పోస్టుమార్టంనిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు డిసిపి తెలిపారు.
నా భర్త ముందే చెప్పాడు: భార్య నారీ భాయ్
భర్తను తన కళ్ల ముందే కాల్చి చంపడంతో భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నాగోల్ గుడిసెల విషయంలో రాజేష్‌తో గొడవలు ఉన్నాయని, అతన్ని వద్ద గన్‌లు ఉన్నాయని పలుమార్లు చెప్పాడని కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదన్నారు. తన భర్తను చంపిన వాళ్లను అదే విధంగా గన్‌తో చంపాలని రోదించారు.
పోలీసుల అదుపులో నిందితులు?
కాల్పులు జరిపిన అనంతరం రాజేష్, శివతోపాటు మరో ఇద్దరూ నిందితులు పోలీసులకు లొంగిపోయిన్నట్లు సమాచారం. కానీ పోలీసులు ఇతవరకూ ఎవరిని అదుపులోకి తీసుకోలేదని త్వరలో నిందితులను పట్టుకుంటామన్నారు. ఆర్థిక లావాదేవిలా లేదా ల్యాండ్ సమస్యలు ఉన్నాయని విచారణ చేస్తున్నామని, చందు నాయక్ పై గతంలో ఓ హత్య కేసులో ఎ2గా ఉన్నట్లు నిర్థారించామని వివరించారు. త్వరలో నిందితులను పట్టుకుని కేసు వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.