Sunday, September 7, 2025

కవిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారించాలి: సిపిఐ నారాయణ

- Advertisement -
- Advertisement -

విపక్షాలకు భస్మాసుర హస్తంగా బిజెపి: నారాయణ
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటు ఎవరికి : కూనంనేని
మన తెలంగాణ / హైదరాబాద్ : విపక్ష రాజకీయ పార్టీలకు బిజెపి ఒక భస్మాసూర హస్తంగా మారుతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె. నారాయణ అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఇ.టి.నర్సింహతో కలిసి నారాయణ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో జతకట్టడం, స్నేహంగా ఉంటూ ఆయా పార్టీల నెత్తిన భస్మాసూర హస్తం పెట్టడం బిజెపి నైజమని విమర్శించారు. జమ్ముకశ్మీర్ లో పిడిపి, మహారాష్ట్రంలో శివసేన, ఎన్‌సిపి పార్టీలను చీల్చిందని, ఆ పార్టీలను ద్వంసం చేసిందని, కుటుంబాల్లో చిచ్చుపెట్టిందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారని, ఇక తెలంగాణ వంతు వచ్చిందన్నారు, కవిత కూడా జైలుకు పోయిందన్నారు. బిఆర్‌ఎస్ ఎప్పుడైతే బిజెపి పంచన చేరిందో ఆ పార్టీ కొంప కొల్లేరయిందని, చివరకు కవిత బయటికి వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకునే పరిస్థితికి వచ్చిందని నారాయణ అన్నారు.

కవిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారించాలి
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంశంలో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను దర్యాప్తు సంస్థలు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో సంబంధం లేదని హరీశ్ తప్పుకున్నప్పటికీ, కెసిఆర్ మాత్రం బాధ్యతగా సమాధానం చెప్పాలని, లేదంటే కవిత ఆరోపణలు వాస్తవంగా భావించాల్సి వస్తుందన్నారు. బిఆర్ అంతర్గత వ్యవహారాలు తమకు సంబంధంల లేదని, కాని బిఆర్‌ఎస్‌లో మొదటి నుంచి క్రీయశీలకంగా ఉన్న కవిత స్వయంగా నిర్ధిష్టమైన అవినీతి ఆరోపణలు చేశారని, ఇది ప్రజా సొమ్ముకు సంబంధించిన అంశమని నారాయణ అన్నారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటు ఎవరికి: కూనంనేని
గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో తెలుగు వ్యక్తి అని వెంకయ్యనాయుడుకు మద్దతు ఇచ్చిన బిఆర్‌ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో కూడా తెలుగువ్యక్తి, తెలంగాణ బిడ్డ, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తారా?, లేదా స్పష్టత ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేంద్రంలోని బిజెపికి మద్దతుగా బిఆర్‌ఎస్ నిలిచిందన్నారు. బిఆర్‌ఎస్ బిజెపిలో విలీనం అవుతందా? ఆ పార్టీ ఉంటుందా? కబళించ బడుతుందా? అని రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత కీలక సమయంలో ఇప్పటికైనా బిఆర్‌ఎస్ స్పష్టత ఇవ్వాలన్నారు. కమ్యూనిస్టులుగా తాము అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల పక్షాన నిలబుడుతామని, బిఆర్ కూడా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. బిజెపి నరమాంస భక్షకులని, అలాంటి బిజెపిని నమ్ముకుంటే దెబ్బతింటారని ఆయన బిఆర్‌ఎస్‌కు సూచించారు.

ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్ తిరిగి చేపట్టాలని, 5వ ప్యాకేజీ వద్ద చిన్న ఎత్తిపోతలను నిర్మించాలని సూచించారు. సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఉపయోగిస్తారా? లేదా? ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఈ బ్యారేజీలను ఉపయోగిస్తే రూ.14వేల కోట్ల విద్యుత్ బిల్లుల ఖర్చు అవుతుందని వివరించారు. రూ. 36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత -చేవేళ్ల ప్రాజెక్ట్ జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ప్రకారం రూ.1,46,000 కోట్ల అంచనాలు పెరిగాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ఏదో పద్ధతిలో ఆర్థిక లాబాలు, దుర్వినియోగం జరిగిందని, కేవలం ఇద్దరు, ముగ్గురు అధికారుల వద్దనే వెయ్యి కోట్ల రూపాయలు దొరికాయని కూనంనేని తెలిపారు.
రాష్ట్రంలో ఎంత మేరకు యూరియా డిమాండ్ ఉన్నది..?,సరఫరా ఎంత చేయాలనే విషయమై ముఖ్యమంత్రి వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా ఎంత అవసరం?, ఇందులో కేంద్రం ఎంత వరకు సరఫరా చేసిందనే విషయమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యూరియా సరఫరాలోని లోపాలను గుర్తించి, ఒక వేళ బ్లాక్ ఉంటే బయటికి తీయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రైతాంగ అసంతృప్తికి తగ్గించి, వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వ్హించేందుకు ముఖ్యమంత్రి పిలుపునివ్వాలని కూనంనేని సాంబశివరావు సూచించారు. . ప్రధాని మోడీ పెద్దన్న పాత్రను పోషించడంలేదని, రాష్ట్రంపై పెత్తనం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు. బిసి బిల్లులను ఆమోదించి తమ చిత్తశుధ్దిని నిరూపించుకోవాలని ఆయన బిజెపికి సూచించారు. సిబిఐ తన స్వతంత్రతను కోల్పోయిందని, కేంద్ర ప్రభుత్వ ప్రలోభాలకు లొంగుతుందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ పారదర్శక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Also Read: బిఆర్ఎస్‌లోనే ఉన్నాను… ఏ పార్టీ కండువా కప్పుకోలేదు: బండ్ల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News