Tuesday, August 12, 2025

అక్షరాలపై ఆంక్షల ఆయుధాలా!

- Advertisement -
- Advertisement -

భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రత ప్రమాదంలో పడేలా ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడమేకాక, తప్పుడు కథనాలతో యువతను పెడదారి పట్టిస్తున్నాయన్న ఆరోపణలతో జమ్మూకశ్మీర్‌లోని కేంద్రపాలిత ప్రభుత్వం 25 పుస్తకాలపై నిషేధం విధించింది. భారతీయ న్యాయ సంహిత 2023 లోని సెక్షన్లు, 152, 196, 197 లోని నిబంధనలను ఈ 25 పుస్తకాలకు అన్వయింప చేస్తూ నిషేధాన్ని అమలులోకి తెచ్చింది. ఇది భావవ్యక్తీకరణ, ప్రచురణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపడమే. ఇది అక్షరాలపై ఆంక్షల ఆయుధాన్ని ప్రయోగించడమే. పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోతుందా? అది విభజనను మరింత పెంచుతుందన్న తీవ్రవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జమ్మూకశ్మీర్ పరిస్థితిపై దృష్టి కేంద్రీకరించి పుస్తకాలను రచించిన దేశ విదేశీ రచయితలు ఈ నిషేధ జాబితాలో ఉన్నారు.

బుకర్‌ప్రైజ్ విజేత అరుంధతీరాయ్, ప్రముఖ రచయితలు ఎజి నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్, సుమంత్రబోస్, డేవిడ్ దేవదాస్, అనూరాధ భాసిన్, అయేషా జలాల్ తోపాటు పలువురి పుస్తకాలపై నిషేధాన్ని (Ban books) ప్రకటించారు. ఈ పుస్తకాలు ఉగ్రవాదాన్ని భారత్‌పై హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో యువత దారి తప్పుతోందని నిఘా వర్గాలనుంచి సమాచారం అందడంతో ఈ పుస్తకాలను నిషేధిస్తున్నామని జమ్మూకశ్మీర్ హోంశాఖ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ పుస్తకాలు ఏవిధంగా హింసను ప్రేరేపిస్తున్నాయో నిరూపించే సంఘటనలేవీ ప్రస్తావించకపోవడం గమనార్హం. హోం శాఖ ఆదేశాల ప్రకారం జమ్మూకశ్మీర్ పోలీసులు పుస్తకాల దుకాణాల్లో సోదాలు నిర్వహించి పుస్తకాలను జప్తు చేశారు.

నిషేధించిన పుస్తకాల్లో ఏముందని పరిశీలిస్తే.. అరుంధతీ రాయ్ 2018 నుంచి 2020 మధ్యకాలంలో ‘భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి కాలమని, మెజారిటీవాదం, మతోన్మాదం పెరుగుతుండడం దేశానికి అత్యంత ప్రమాదకరమని తాను అనేక వ్యాసాలు, ఉపన్యాసాల్లో హెచ్చరించారు. అవన్నీ ఆజాదీ పేరున సంకలనంగా వెలువడ్డాయి. ఆ ఆజాదీయే నిషేధానికి గురైంది. రాజ్యాంగ నిపుణుడైన ఎజి నూరానీ రాసిన ‘ది కశ్మీర్ డిస్పూట్ ’ :1947 2012’ దీర్ఘకాల కశ్మీర్ సమస్య సంక్లిష్ట చరిత్రను, దానితో చెలరేగిన రాజకీయ అసంతృప్తిని వివరిస్తుంది. బ్రిటిష్ రచయిత్రి, చిత్రకారిణి విక్టోరియా స్కోఫీల్డ్ రాసిన ‘కశ్మీర్ ఇన్ కాన్‌ఫ్లిక్ట్’ ఇండియా, పాకిస్థాన్ అండ్ ది అన్‌ఎండింగ్ వార్’, జర్నలిస్ట్, కశ్మీర్‌టైమ్స్ ఎడిటర్ అనురాధా బాసిన్ రాసిన ‘ది డిస్మాంటిల్డ్ స్టేట్ : ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370’, కంటెస్టెడ్ ల్యాండ్స్ ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకశ్మీర్‌లోని ప్రజల జీవితాలు, స్థానిక రాజకీయ, సామాజిక రంగాలపై ఆ ప్రభావం ఎలా ఉందో వివరిస్తుంది. డేవిడ్ దేవదాస్ రాసిన ‘ఇన్‌సెర్చ్ ఆఫ్ ఎ ఫ్యూచర్’ ది స్టోరీ ఆఫ్ కశ్మీర్ కూడా ఆ కోవకు చెందినదే.

మొత్తం మీద ఈ పుస్తకాలన్నీ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, విధ్వంసాలు, అక్కడి దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వంపై అసమ్మతిని ఉక్కుపాదంతో అణగదొక్కడానికి ఇప్పటికే దేశమంతటా సెన్సార్ షిప్‌ను ఒక ఆయుధంగా వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు 2019 తరువాత జమ్మూకశ్మీర్‌లో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తన మందబలంతో రచయితల కలాలకు సంకెళ్లు వేయవచ్చు. కానీ కశ్మీర్ చరిత్ర పుస్తకాలలో మాత్రమే లేదు. అది ప్రజల జ్ఞాపకాలలో ఉంది. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు. తరతరాలు కొనసాగుతుంటాయి’ అని రచయితలు వ్యాఖ్యానిస్తున్నారు. ‘నా పుస్తకంలో ఎక్కడా ఉగ్రవాదాన్ని ప్రశంసించే ప్రసక్తే లేదు. ప్రభుత్వాల పాలనా వైఖరిని విమర్శించడం తప్ప. మరి ఈ రెండిటికీ తేడా ఏమిటో అధికారులు గమనించడం లేదు.

ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి’ అని ప్రముఖ ఎడిటర్ అనూరాధ బాసిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సెన్సార్ షిప్ సంఘటనలు ప్రపంచానికి, దేశానికి ముఖ్యంగా కశ్మీర్‌కు కొత్తేమీ కాదు. పుస్తకాలను నిషేధించి భావవ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. 1910 లో బ్రిటిష్ పాలకులు మహాత్మాగాంధీ రాసిన హింద్ స్వరాజ్ పుస్తకం గుజరాతీ ఎడిషన్‌ను రాజద్రోహంగా ఆరోపిస్తూ నిషేధించారు. 1933 మేలో నాజీ విద్యార్థులు జర్మన్‌వి కావన్న ద్వేషంతో వేలాది పుస్తకాలను తగులబెట్టారు. 1904లో మున్షీ ముహమ్మద్ దిన్ ఫౌక్ శ్రీనగర్‌లో ఒక వార్తా పత్రికను ప్రచురించడానికి ప్రయత్నించారు. దీనికోసం అప్పటి డోగ్రా పాలకుడు మహారాజా ప్రతాప్ సింగ్ అనుమతి కోరారు.

దీనికి అనుమతి లభించలేదు. అంతేకాదు భవిష్యత్తులో అలాంటి అభ్యర్థనలను స్వీకరించకుండా నిబంధనలను కట్టుదిట్టం చేయాలని మహారాజా ప్రతాప్ సింగ్ తన ప్రధాన మంత్రిని ఆదేశించారు. 2010లో 17 ఏళ్ల విద్యార్థి తుఫైల్ చుట్టూ హత్య తరువాత భారీ ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగడంతో ప్రభుత్వం ఎస్‌ఎంఎస్ సేవలను నిషేధించింది. మూడేళ్ల తరువాత కానీ ఆ సేవలను పునరుద్ధరించలేదు. 2016 లో కశ్మీర్‌లో తిరుగుబాటు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని ఇండిపెండెంట్ పత్రిక అయిన కశ్మీర్ రీడర్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఈ పత్రిక హింసను ప్రేరేపిస్తోందని ఆరోపించింది. కశ్మీర్‌లో ప్రభుత్వ పాలనా యంత్రాంగంలోని లోపాలను ధైర్యంగా ఎత్తి చూపే నిజాయితీగల జర్నలిస్టులకు నిర్బంధాలు నిత్యం పరిపాటిగా జరుగుతున్నవే. ఆ ధోరణి 2019 నుంచి మరింత పెచ్చుమీరడం శోచనీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News