Tuesday, May 20, 2025

హిమంత పాలనలో నేరాల చిక్కుముడి

- Advertisement -
- Advertisement -

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో ప్రభుత్వం నేరాల రేటును తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించిందని తరచు చెబుతూనే ఉంది. ఇందుకు బలమైన పోలీసింగ్ చర్యలను ఉటంకిస్తోంది. అయితే, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో టెర్రరిస్ట్ దాడి వంటి సంఘటనల తర్వాత అసమ్మతి వ్యక్తం చేసిన వారి అరెస్ట్‌లతోపాటు, శాంతిని గొప్పగా ప్రదర్శించడానికి కొద్దిగా మాత్రమే కేసుల నమోదును రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపణలు వచ్చాయి. అందువల్ల స్పష్టమైన చిత్రం తెలియాలంటే, అసోం లో నేరాల ధోరణులు, ప్రభుత్వ విధానాలు, దాని చర్యల సామాజిక చిక్కులను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. అందుకు అందుబాటులో ఉన్న డేటా, నివేదికలే వాడుకోవాలి. అసోంలో నేరాల రేటు తగ్గుదల గురించి ముఖ్యమంత్రి బిశ్వ శర్మ పదేపదే హైలైట్ చేశారు. ఆయన ప్రకటన ప్రకారం లక్ష జనాభాకు నేరాల రేటు 2020లో 349 ఉండగా, 2024లో 139కి తగ్గింది. అంటే 60% తగ్గిందన్నమాట.

మొత్తం నమోదైన క్రిమినల్ కేసులు 2020లో 1,21,609 ఉంటే, 2024లో 50,215 కి తగ్గాయని అదేకాలంలో చార్జిషీట్ రేటు 44.8% నుంచి 66.7 శాతానికి, నేరారోపణ రేటు 5.5% నుంచి 25 శాతానికి పెరిగిందని తెలుస్తోంది. మహిళలపై నేరాలు బాగా తగ్గాయి. 2020లో 26,352 కేసులు ఉండగా, 2024లో 5,555కి తగ్గాయి. బాల్యవివాహాలను కఠినంగా అరికట్టారు. కేసుల నమోదు 2020లో 138 నుంచి 2023 లో 5,498కి పెరిగాయి. అదనంగా అసోం పోలీసులు 2020 నుంచి రూ. 2,885 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లోనే 3,323 మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. అయితే ఈ గణాంకాలపై వివాదాలు లేకపోలేదు. నమోదైన కేసుల సంఖ్య తగ్గుదల, వాస్తవంగా జరిగిన నేరాల కంటే తక్కువగా ఈ నివేదికలు ఉన్నాయని విమర్శకులు వాదిస్తున్నారు.

నేరాల సంఖ్యలను తగ్గించి, కేసుల నమోదునూ పరిమితం చేయాలని పోలీసు స్టేషన్లకు ముందే సూచించారనే ఆరోపణలున్నాయి. ఇది సెలెక్టివ్ పోలీసింగ్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలకు అద్దంపడుతోంది. ఉదాహరణకు 2024 నివేదిక ప్రకారం శర్మ పదవీకాలంలో మొదటి 15 నెలల్లో 171 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా 56 మంది మరణించారు. 139 మంది గాయపడ్డారు. అయితే చట్టవిరుద్ధమైన చర్యలు, నేరాల నివేదికలపై వాటి ప్రభావం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశాంత భూషణ్ వంటి న్యాయవాదులు నకిలీ ఎన్‌కౌంటర్‌లు అని విమర్శించిన ఈ ఎన్‌కౌంటర్లు, దొంగతనం, గృహహింస లేదా దోపిడీ వంటి రోజువారీ నేరాల దర్యాప్తును తప్పుదోవపట్టిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్లపై సుప్రీం కోర్టు పరిశీలన, అసోంలో చట్టం అమలులో పారదర్శికతను, జవాబుదారీతనంతో తలెత్తే సమస్యలను నొక్కి చెబుతోంది. అంతే కాకుండా, మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం ప్రకటిస్తుండగా, 2025 మొదటి రెండు నెలల్లో అసోంలో 121 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

2024లో 1,019 కేసులు, 2023లో 989 కేసులు, 2022 లో 1,113 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యలు 2021, 2020లో వరుసగా 1,733, 1657 కేసుల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మహిళలపై నేరాలు నిరంతర సవాలుగా కొనసాగుతున్నాయని సూచిస్తున్నాయి. బాల్యవివాహాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం ప్రశంసనీయమే. అయినా, ముఖ్యమైన సమస్యలను మరుగున పడేటట్లు చేస్తోంది. ఉదాహరణకు అసోంలో సంభవించిన వరదలలో 2024లో 113 మంది చనిపోగా, 3.3 మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. విస్తృత ప్రజాభద్రతా చర్యల అవసరాన్ని హైలైట్ చేస్తోంది. పోలీసులు కేవలం రాజకీయ భద్రతలకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ వక్రీకరణ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ప్రజల భద్రత కన్నా విమర్శకుల నోరు మూయించడంపైనే పోలీసులు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అనిపిస్తోంది. పహల్గాం ఊచకోత, సామాజిక సమీకరణలు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న టెర్రరిస్ట్‌ల దాడి, 26 మంది పౌరులు, ముఖ్యంగా హిందూ పర్యాటకుల హత్య అసోం లో తీవ్రప్రభావాన్ని చూపింది.

లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా అనుమానిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) దుండగులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిల్చింది. భద్రతా చర్యల సమీక్షను తీవ్రతరం చేసింది. అసోంలో ప్రభుత్వం తన సంతాపాన్ని వ్యక్తం చేయడమే కాక, బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే, ఈ దాడికి సంబంధించి జాతీయ వ్యతిరేక ప్రకటనలు, పాక్ అనుకూల ప్రకటనలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వివాదాస్పదంగా మారాయి. ఏప్రిల్ 28వ తేదీలోగానే పాక్‌ను సమర్థించిన లేదా ప్రభుత్వ భద్రతా చర్యలను విమర్శించినందుకు అసోం పోలీసులు ఎఐయుడిఎఫ్ ఎంఎల్‌ఎ అమీనుల్ ఇస్లాం సహా 27 మందిని అరెస్ట్ చేశారు. పహల్గాం, 2019 పుల్వామా దాడులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అని ఆరోపించినందుకు ఇస్లాంపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ధధీచి డింపుల్ వంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవడమే కాక, పలువురిని అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి శర్మ ఈ అరెస్ట్‌లను సమర్థించుకుంటూ, అసోం సర్కార్ పాక్‌కు మద్దతు ఇవ్వడాన్ని సహించబోదని, నేరాలకు అలవాటుపడిన వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ను ప్రయోగిస్తుందని స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం ఈ అరెస్ట్‌లను, అసమ్మతివాదులను అణచి వేసేందుకు, ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేసుకుని సామాజిక విభజనను పెంచుతోందని, దీని ద్వారా సామాజిక అంతరాలను మరింత పెంచుతోందని సోషల్ మీడియాలో విమర్శకులు ఆరోపించారు. సిఎం శర్మ చర్యలు దుర్మార్గపు ఇస్లామోఫోబియాను ప్రతిబింబిస్తున్నాయని, 58 అరెస్ట్‌లు యుద్ధ వ్యతిరేక వ్యాఖ్యలు, ప్రభుత్వ విమర్శలకు సంబంధించినవని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కలపై స్వతంత్ర ధ్రువీకరణలు లేకపోయినా అతిని హైలైట్ చేస్తోంది. ఇక్కడ భిన్నాభిప్రాయాలను జాతివ్యతిరేకత ముద్రవేస్తున్నారు. విమర్శకులను దేశద్రోహులుగా చిత్రీకరించే శర్మ వాక్చాతుర్యం మెజారిటీ భావాలను ప్రోత్సహించవచ్చు. సుప్రీం కోర్టు దేశద్రోహం ఆరోపణలకు సంబంధించి నిర్దుష్టమైన పరిమితులు పేర్కొంది. హింసను ప్రేరేపించినట్లు ఉంటేనే దేశద్రోహంగా భావించాలని పేర్కొంది.

కానీ, పోలీసులు ఈ అంశంతో సంబంధం లేని కేసులలో అభియోగాలు నమోదు చేస్తూనే ఉన్నారు. పహల్గాం దుర్ఘటన తర్వాత 2025లో జరిగిన అరెస్ట్‌లు యుద్ధ వ్యతిరేక లేదా శాంతి కోరుకునే వాదనతో కూడిన వ్యాఖ్యలతో సహా అన్నీ దేశ వ్యతిరేక కార్యకలాపాలుగానే పరిగణించడాన్ని సూచిస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛపై అంతర్జాతీయ ప్రమాణాలను ఉల్లంఘించడమే. అసోంలోని విభిన్న వర్గాలను ఏకంచేయాలనే శర్మ వాదన, ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి లక్ష్యాలకు విరుద్ధంగా ఉంది. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం భావనలపై అణచివేత, నేరాలను తగ్గించి చూపే నివేదికలు, ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసి, 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రం లో అశాంతిని రేకెత్తించే ప్రమాదం ఉంది. అసోం ఎంతో శాంతియుతంగా ఉందని చిత్రీకరించేందుకు, కొన్ని కేసులను నమోదు చేయవద్దని ఆదేశాలు వచ్చాయనే ఆరోపణ ఆందోళన కలిగిస్తోంది.

అందిన డేటా ఈ అంశాన్ని నిర్ధారించకపోయినా, నమోదైన కేసులు మాత్రం బాగా తగ్గాయి. 2020లో 1,21,609 కేసులు నమోదైతే, 2024లో 50,215 కేసులో నమోదు కావడం నిజంగా కేసులు తగ్గాయా లేక కొన్ని కేసులనే నమోదు చేస్తున్నారనే వాదనను ప్రతిబింబిస్తున్నదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2022 ఎన్‌సిఆర్‌బి నివేదిక ప్రకారం అసోంలో నేరాల రేటు పెరగడానికి కారణం ముఖ్యంగా మహిళలపై నేరాల సంఖ్య పెరగడం. గతంలో డేటా వాస్తవ నేరాల స్థాయిని సూచిస్తోంది. అకస్మాత్‌గా నేరాల తగ్గుదల ఫిర్యాదులను బాగా వడపోస్తున్నారని సూచిస్తోంది. ముఖ్యంగా చిన్న నేరాలను నమోదు చేసి ఉండకపోవచ్చు. ఇదే నిజమైతే పోలీసులు, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది.బాధితులు నేరాలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకంజ వేయవచ్చు. ఎందుకంటే వారి కేసులను నమోదు చేయకపోవచ్చు. ఫలితంగా రిపోర్ట్ కాని నేరాల సంఖ్యపెరిగి అడ్డూఆపూ లేని నేరాలకు దారితీయవచ్చు.

అసోం సిఎం శర్మ పాలనలో నేరాల తగ్గింపు వ్యూహానికి మూలస్తంభం బలమైన, రాజీలేని పోలీసింగ్ అని స్పష్టమైంది. ఇందులో అక్రమరవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విధ్వంసం వంటి కార్యక్రమాలు హైలైట్. 2021లో మాదకద్రవ్యాలపై బుల్డోజర్ నడపడం వంటి కార్యక్రమాలలో సిఎం వ్యక్తిగతంగా పాల్గొన్నారు. తరచు నిర్దిష్ట వర్గాలకు చెందిన నేరస్థులను లక్ష్యంగా చేసుకుంటూ పోలీసులు సాగించిన ఎన్‌కౌంటర్ల సరళి మానవ హక్కులకు పాల్పడ్డారనే విమర్శలకు తావు ఇచ్చింది. 2021లో జాతీయ మానవహక్కుల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులో అసోం పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లు చేశారని, నిర్బంధించిన వారిని అనుమానాస్పద పరిస్థితుల్లో కాల్చి చంపారనే ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం దూకుడు వైఖరి కొన్ని నేరాల సంఖ్య తగ్గించడంలో ప్రభావం చూపినా, ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచవచ్చు.

సమాజాలనూ దూరం చేయవచ్చు. పహల్గాం దాడి తర్వాత జరిగిన అరెస్ట్‌లు, ముఖ్యంగా ముస్లింలు, ప్రతిపక్ష నాయకుల అరెస్ట్‌లు, రాజకీయ దురుద్దేశంతో చేసినవేననే విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం భద్రతా వైఫల్యాలను సరిదిద్ది, సమస్యలను పరిష్కరించకుండా విమర్శకుల నోరునొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ధోరణి మతపరమైన ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వివిధ జాతులు, మత వైవిధ్యపరమైన చరిత్రగల రాష్ట్రంలో పహల్గాం ఊచకోతకు ప్రతిస్పందనగా జాతీయ భద్రతపట్ల ప్రభుత్వం నిబద్ధతను ప్రతిబింబిస్తున్నది. అయితే కొన్ని వర్గాలను టార్గెట్ చేయడం, సామాజిక అంతరాలను మరింత పెంచుతుంది. ఇది అసోం సామాజిక వ్యవస్థ నిర్మాణానికే ముప్పుకలిగించే అవకాశం ఉంది.ఈ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. నేరాలను నిజాయితీగా నిర్ధారించాలి.

పోలీసు చర్యలపై స్వతంత్ర పర్యవేక్షణను ప్రోత్సహించాలి. ప్రభుత్వ విధానాల విమర్శలను జాతి వ్యతిరేకతతో ముడిపెట్టడానికి స్వస్తి చెప్పాలి. అన్ని విషయాల్లో బ్యాలెన్సింగ్ లేదా సమతుల్యతను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పారదర్శకంగా నేరాలను నిర్ధారించాలి. సాధారణ నేరవిచారణకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రాలకు రాజ్యాంగ పరరిరక్షణతో పోలీసింగ్ బాసటగా నిలవాలి. సుప్రీం కోర్టు సూచించినట్లు పోలీసు ఎన్‌కౌంటర్‌లు, అరెస్ట్‌లు స్వతంత్ర దర్యాప్తులు జవాబుదారీతనాన్ని పెంచుతాయి. ఈ సమస్యలు పరిష్కరించని పక్షంలో అసోం ప్రభుత్వంపై అపనమ్మకం పెరిగి, పరిష్కరించబడని నేరాలకు ఆలవాలం అవుతుంది ఫలితంగా ఇది సామాజిక భద్రత, ఐక్యతను దెబ్బతీస్తుంది.

గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)

( రచయిత, ఈశాన్య రాష్ర్టాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News