పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని దాచిపెట్టారనే ఆరోపణల నేపథ్యంలో సర్వీస్ నుంచి ఓ జవాన్ ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) తొలగించింది. వివరాల్లోకి వెళితే.. జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన మునీర్ అహ్మద్.. ఏప్రిల్ 2017లో CRPFలో చేరారు. ఆ తర్వాత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన మినాల్ ఖాన్‌తో మునీర్ కు ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి 2024 మేలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. మే 24న వీడియో కాల్ నిఖా వేడుక ద్వారా వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, పాకిస్తాన్ మహిళతో తన వివాహం దాచిపెట్టారనే ఆరోపణలతో అమీర్ ను సర్వీస్ నుండి CRPF తొలగించింది. ఆ మహిళ వీసా ముగిసినా భారత్ లో ఉండటానికి అహ్మద్ ఉద్దేశపూర్వకంగా సహాయం చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అమీర్ ఖండించారు. CRPF ప్రధాన కార్యాలయం నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే ఆమెను వివాహం చేసుకున్నానని అతను చెప్పారు.
“నా తొలగింపు గురించి మొదట మీడియా నివేదికల ద్వారా తెలిసింది. ఆ తర్వాత నాకు CRPF నుండి తొలగింపు గురించి తెలియజేస్తూ ఒక లేఖ వచ్చింది. ఇది నాకు, నా కుటుంబానికి షాక్ కు గురిచేసింది. ఎందుకంటే.. నేను ప్రధాన కార్యాలయం నుండి అనుమతి పొందిన తర్వాతనే పాకిస్తానీ మహిళతో నా వివాహం జరిగింది” అని అమీర్ చెప్పారు. తన తొలగింపును కోర్టులో సవాలు చేయనున్నట్లు పేర్కొన్నాడు.