Tuesday, May 13, 2025

ఇరుకునపడిన ఈశాన్య భారతం

- Advertisement -
- Advertisement -

భారతదేశం ఈశాన్యం, తూర్పు ప్రాంతాలలోని అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలను సెవెన్ సిస్టర్స్‌గా వ్యవహరిస్తారు. ఈ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ భౌగోళిక, రాజకీయ నేపథ్యంలో ప్రత్యేకమైనవి. ఈ రాష్ట్రాలు బంగ్లాదేశ్, చైనా, మయన్మార్, భూటాన్‌లతో సరిహద్దులను పంచుకుంటాయి. ఇవి భారతదేశ భద్రతా వ్యవస్థలో కీలకమైన సరిహద్దుగా మారా యి. భారతదేశం పాకిస్తాన్ వివాదం కొన్ని విధాలైన సవాళ్లను తీవ్రతరం చేస్తున్నది. భద్రతాపరమైన సవాళ్లు ఈశాన్యానికి తిరుగుబాట్ల చరిత్ర ఉంది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్‌ఎస్‌సిఎన్) యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆప్ అసోం (యుఎల్‌ఎఫ్‌ఎ) వంటి గ్రూప్‌లు ఈ ప్రాంత ప్రజలలోని అసంతృప్తిని ఉపయోగించుకుంటున్నాయి. పాకిస్తాన్, చైనాలు ఈ ప్రాంతాన్ని అస్థిరపరచే లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. పాక్ నిఘా సంస్థలు బంగ్లాదేశ్ ద్వారా తిరుగుబాటు గ్రూప్‌లకు మద్దతు ఇస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుత వివాదం అటువంటి కార్యకలాపాలకు మరింత ఊతం ఇవ్వవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కశ్మీర్ నుంచి భారతదేశం దృష్టిని మళ్లించడానికి ఇక్కడి చిచ్చును తీవ్రతరం చేయవచ్చు. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ముఖ్యంగా 2024 ఆగస్టులో బంగ్లా ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలై, మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆదేశంలో రాజకీయ అస్థిరత పెరిగింది. హసినా ప్రభుత్వం గతంలో తిరుగుబాటు గ్రూప్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. సరిహద్దు భద్రత విషయంలో భారతదేశానికి సహకరించింది. అయితే, బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం చైనా, పాకిస్తాన్ వైపు మొగ్గుచూపడం ఆందోళనలను రేకెత్తిస్తోంది. భారత్- పాక్ యుద్ధం జరిగితే, ఈశాన్య భారతాన్ని బంగ్లాదేశ్, చైనా విలీనం చేసుకోవాలని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎఎల్ ఎం ఫజూర్ రెహమాన్ వంటి బంగ్లా నాయకులు చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు ఉద్రిక్తతలను పెంచాయి.

ఇది రాజకీయ ఎత్తుగడగా తీసివేసినా, ఇలాంటి వాగుడు భారత వ్యతిరేక భావనను, సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచే ప్రమాదం ఉంది. అసోం, త్రిపుర, మేఘాలయ, మిజోరాంలలో 4,096 కిలోమీటర్ల మేరకు ఉన్న భారత- బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా అక్రమ వలసలు, ఆయుధాల అక్రమరవాణా, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లోని జమాతే- ఇ- ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్ వంటి ఇస్లామిక్ గ్రూప్ లపై తాత్కాలిక ప్రభుత్వం నియంత్రణలను సడలించడం వల్ల భారతదేశం తూర్పు ప్రాంతంలో మళ్లీ టెర్రరిస్ట్ నెట్ వర్క్ బలపడవచ్చు. బంగ్లాదేశ్‌లో చైనా ప్రభావం పెరుగుతున్న తీరు, భారత చైనా సరిహద్దుల్లో దాని విస్తరణ విధానాలు మరింత ముప్పు కలిగిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతం, ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్ భారత- చైనా సంబంధాలలో ఒక కీలకమైన అంశం.

చైనా ఈ ప్రాంతాన్ని -దక్షిణ టిబెట్-గా పేర్కొంటోంది. ఇక బంగ్లాదేశ్‌తో ఓడ రేవులు, మౌలిక సదుపాయాలకు పెట్టుబడులు, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్‌ఐ) ప్రాజెక్టులు వ్యూహాత్మకంగా భారతదేశాన్ని చుట్టుముట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈశాన్య భారతం ప్రధాన భూభాగానికి అనుసంధానంగా ఉన్న ఇరుకైన స్ట్రిప్ సిలిగురి కారిడార్ సమీపంలోప్రతిపాదించిన చైనా వైమానిక స్థావరం భారతదేశం భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతోంది. భారత్ పాక్ వివాదంవల్ల చైనా భారతదేశంతో గల తన పశ్చిమ సరిహద్దుపై మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. 1971 భారతదేశంతో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేయడంతోపాటు అన్ని విధాలా మద్దతు ఇచ్చింది.

అలాంటి చైనా ఇప్పుడు భారతదేశాన్ని బలహీనపరచడానికి పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. చైనా పాకిస్తాన్ సమన్వయంతో నడిపే వ్యూహం భారతదేశం సైనిక వనరులను దెబ్బతీయవచ్చు. అలాగే పాక్-, చైనా, అస్థిర బంగ్లాదేశ్‌లతో కూడిన మూడు దేశాలను భారతదేశం వ్యూహాత్మకంగా ఎదుర్కోవలసి రావచ్చు. వాణిజ్యం, కనెక్టివిటీ కోసం ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ పై ఎక్కువ ఆధారపడతాయి. చిట్టగాంగ్ ఓడరేవు, అగర్తల- అఖౌరా ప్రాజెక్టు వంటి రైలు మార్గాల ప్రాధాన్యత ఈ ప్రాంతం అంతర్జాతీయ మార్కెట్లతో ఏకీకరణకు దోహదపడుతుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 15.9 బిలియన్ అమెరికా డాలర్లు. ఇది ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు మద్దతు నిస్తోంది. బంగ్లాదేశ్ ఈ ప్రాంతానికి 2 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తుంది.

భారత- పాకిస్తాన్ వివాదం, బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావనలు, దిగజారుడు ధోరణులు భారత్- బంగ్లాదేశ్ సంబంధాలకు మప్పుగా కన్పిస్తున్నాయి. యూనస్ రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భారతదేశం 2025 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ ఎగుమతుల కోసం ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాలను ఉపసంహరించుకుంది. ఇది ఆర్థిక పతనానికి దారితీసే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. వాణిజ్యం, కనెక్టివిటీలో ఏర్పడుతున్న అంతరాయాలు ఈశాన్యాన్ని ఒంటరిగా చేస్తాయి. భారతదేశం- యాక్ట్ ఈస్ట్ -విధానాన్ని, బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఆర్థిక కౌన్సిల్ (బిఐఎంఎస్ టిఇసి) వంటి ప్రాంతీయ ఏకీకరణ ప్రయత్నాలనూ బలహీన పరుస్తాయి.

బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం, భారత్- పాక్ వివాదం వల్ల శరణార్థుల సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉంది. 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలో లక్షలాది మంది బంగ్దాదేశీయులు భారతదేశానికి పారిపోయారు. మళ్లీ ఇలాంటి అస్థిరత మళ్లీ వలసలకు దారితీయవచ్చు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారే కోటీ 50 లక్షలకు పైగా ఉన్నారని అంచనా. ఇప్పటికే పలు సామాజిక ఉద్రిక్తతలతో పోరాడుతున్న ఈశాన్య ప్రాంతం దుర్బలంగా ఉంది. దీనికి తోడు బంగ్లాదేశీ జాతీయులు ఆశ్రయం పొందకుండా నిరోధించాలని నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల భారతదేశంలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. జాతి, మతపరమైన అంశాలలో సున్నిత లోపాలు గల ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యంపోసే ప్రమాదమూ ఉంది.

అవామీలీగ్ షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసిన విద్యార్థుల తిరుగుబాటు తర్వాత బంగాదేశ్‌లో రాజకీయ చిత్రం అస్థిరంగా ఉంది. మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాలను, పెరుగుతున్న మతోన్మాదం, భారత దేశంతో దెబ్బతిన్న సంబంధాల మధ్య చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదటినుంచి భారత దేశాన్న శత్రువుగా భావించే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారం అందుకొనే అవకాశం ఉంది. అదే జరిగితే, బంగ్లాదేశ్ చైనా, పాకిస్తాన్‌లకు మరింత దగ్గరయ్యే వీలు ఉంది. ఈమధ్య కొత్తగా భారతీయ వస్తువులను బహిష్కరించాలని సమర్థించే ఇండియా అవుట్ ప్రచారం మొదలైంది. హసీనాకు భారతదేశం మద్దతు ఇస్తున్నదన్న భావనతో ఆజ్యంపోసుకున్న ఈ ప్రచారం భారత వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. ఈ మార్పు భారతదేశంపై వ్యూహాత్మక ప్రభావాన్ని చూపుతుంది.

హసీనా ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టడమే కాకా, కనెక్టివిటీ ప్రాజెక్టులను సులభతరం చేసింది. కానీ, తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిక్ నాయకులను విడుదల చేయడం, చైనా, ఇస్లామాబాద్‌లతో సంబంధాలు ఆ ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తున్నాయి. చైనా బంగ్లాదేశ్ కు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆపర్ చేయడం, బంగ్లాలోని ఇస్లామిక్ వర్గాలకు పాక్‌తో గల అనుబంధం, బంగ్లాదేశ్‌ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మార్చవచ్చు. ఇది భారతదేశం తూర్పు ప్రాంతం భద్రతను క్లిష్టతరం చేయవచ్చు. భారత్ పాకిస్తాన్ వివాదం, ప్రాంతీయ అస్థిరత ప్రభావాన్ని తగ్గించడానికి, భారతదేశం బహుముఖ వ్యూహాన్ని అవలంబించాలి. సరిహద్దు భద్రతను బలోపేతం చేయాలి. అక్రమ రవాణా, టెర్రరిజం, అక్రమ వలసలను అరికట్టడానికి భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచి, సమన్వయాన్నిమెరుగుపరచాలి.

డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యవేక్షణ వంటి సాంకేతికత ఆధారిత పరిష్కారాలలో పెట్టుబడులు పెట్టాలి. బంగ్లాదేశ్‌తో దౌత్యపరమైన చర్చ అవసరం, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా తన ప్రభావాన్ని కొనసాగించడానికి భారతదేశం బంగ్లా నేషనలిస్ట్ పార్టీతో సహా ఆ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి. వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడంతోపాటు తీస్తా నది వివాదం వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా విశ్వాసాన్ని పునరుద్ధరించవచ్చు. బిఐఎంఎస్‌టిఇసి వంటి కార్యక్రమాల ద్వారా బంగ్లాదేశ్‌తో ఆర్థిక, సహకారాన్ని మరింత పెంచుకోవడం, చైనా బిఆర్‌ఐ ప్రాజెక్టులను అధిగమించడానికి పోటీగా బలమైన మౌలిక ప్రాజెక్టులను అందించడం, బంగ్లాదేస్ ఆర్థిక స్థిరీకరణకు మద్దతుగా నిలిచేందుకు అమెరికా, యుఎఇ, జపాన్ వంటి మిత్రదేశాలతో సహకరించడం ముఖ్యం. ఈశాన్య భారతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను, వేగవంతం చేయడంతోపాటు, స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా, తిరుగుబాటు ప్రమాదాలను తగ్గించవచ్చు.

బంగ్లాదేశ్‌పై ఆధారపడడాన్ని తగ్గించి మయన్మార్, థాయిలాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. దౌత్యాన్ని అనుసరించి పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను నివారించడానికి అంతర్జాతీయ మధ్యవర్తులను ఉపయోగించుకోవాలి, బహుముఖ సవాళ్లనుంచి భారతదేశం వనరులను కాపాడుకోవాలి. బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత, చైనా ప్రాంతీయ ఆశల నేపథ్యంలో భారత్- పాక్ మధ్య పెరుగుతున్న శత్రుత్వం, ఈశాన్య, తూర్పు భారతదేశానికి సంక్లిష్టమైన సవాళ్లను విసిరింది. ఈ ప్రాంతంలో తిరుగుబాట్లు, ఆర్థికపరమైన సమస్యలు, శరణార్థుల బెడదను పెంచవచ్చు. అందువల్ల బలమైన, వ్యూహం అవసరం ఉంది. భద్రతా చర్యలు, దౌత్యపరమైన ప్రయత్నాలు, ప్రాంతీయ సహకారాన్ని సమతుల్యం చేయడంద్వారా భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవచ్చు.

2025 మే 10న భారత- పాక్ మధ్య కాల్పుల విరమణ ఈశాన్య భారతదేశానికి కాస్త ఉపశమనం కలిగించింది. బంగ్లాదేశ్ రాజకీయ గందరగోళం, మధ్య పాక్ మద్దతు దారులైన తిరుగుబాటుదారుల ముప్పు తగ్గించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా విస్తరణను ఎదుర్కొనడానికి భారతదేశం సైనిక బలగాలను పెంచడానికి వీలు కలిగిస్తోంది. అప్పుడప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘనలు కొత్త శత్రుత్వ ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో వాణిజ్యం, కనెక్టివిటీకి ఆ దేశంలో భారత వ్యతిరేక భావనలు అంతరాయంగా మారుతున్నాయి. టెర్రరిజం, శరణార్థుల ప్రమాదాలు నివారించడానికి, భారతదేశం యాక్ట్ ఈస్ట్ విధానాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు బంగ్లాదేశ్‌తో దౌత్యం, సరిహద్దుల భద్రతను బలోపేతం చేయడం ఎంతో అవసరం.

  • గీతార్థ పాఠక్ ఈనాన్యోపనిషత్ ( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News