లండన్: టీమిండియా ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కింగ్‌స్టన్ ఓవల్ స్టేడియం పిచ్ క్యూరేటర్ లీ ఫోరిస్ట్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరిగే ఐదో, చివరి టెస్టుకు లండన్‌లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్టు టీమిండియాకు చాలా కీలకంగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాల్సిందే.
చివరి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే ఓవల్ చేరుకుంది. అంతేగాక భారత జట్టు సాధన కూడా ప్రారంభించింది. ఇదే సమయంలో పిచ్ క్యూరేటర్‌తో గంభీర్‌కు వివాదం నెలకొంది. క్యూరేటర్ వ్యవహరించిన తీరుపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గంభీర్, లీ ఫోరిస్ట్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు ఇక్కడ ఓ మైదాన సిబ్బంది మాత్రమే. టీమిండియాకు నీ సలహాలు, సూచనలు అవసరం లేవు. ఏం చేయాలో మాకు తెలుసు. నీవు పిచ్ గురించి మాకు చెప్పాల్సింది ఏమీ లేదు. కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేస్కో అంటూ గంభీర్ క్యూరేటర్‌ను హెచ్చరించినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా, ఇద్దరి మధ్య వాగ్వాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియడం లేదు.