మనతెలంగాణ, సిటిబ్యూరోః ఐపిఎస్ దయా నాయక్ పేరు చెప్పి ఓ వృద్ధుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.33,40,000 లక్షలు కొటేశారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, బోయిన్‌పల్లికి చెందిన వృద్ధుడు(73)కి ఓ వ్యక్తి ఫోన్ చేసి కర్నాటక క్రైం బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, తన పేరు గౌరవ్ సారథిగా చెప్పాడు. మీ ఆధార్ కార్డు మీస్ యూజ్ అయిందని, క్రిమినల్ కేసు నమోదు చేశామని చెప్పాడు. దాని ద్వారా హ్యుమన్ ట్రాఫికింగ్ చేశారని తెలిపాడు. నేషనల్ సీక్రెట్ యాక్ట్ 1923కింద కేసు నమోదు చేశామని, నకిలీ పత్రాలు పంపించాడు. తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఐపిఎస్ ఆఫీసర్ దయా నాయక్‌ను మాట్లాడుతున్నానని చెప్పాడు.
ఫండ్ వెరిఫికేషన్ కోసం వెంటనే రూ.15లక్షలు డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే అదుపులోకి తీసుకుంటామని బెదిరించాడు. భయపడిపోయిన వృద్దుడు వెంటనే రూ.15లక్షలు పంపించాడు. తర్వాత వివిధ రకాలుగా సుప్రీంకోర్టు ఆడిటర్, ఇన్‌కంట్యాక్స్ అధికారి పేరుతో భయపెట్టడంతో జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు రూ.33.40లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇలా పంపించిన డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పిన నిందితులు తర్వాత స్పందించకపోవడంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.