హైదరాబాద్: ఆన్‌లైన్‌లో రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది ఈ ఆన్‌లైన్ మోసాలకు బలి అవుతున్నారు. కొందరు తెలిసి తెలియక ఆన్‌లైన్ మోసాల బారీన పడుతుంటే.. మరికొందరు చదవుకున్న వాళ్లు కూడా ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు వీటిని అరికట్టేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ముఠాను సైబర్ సెక్యూరిటీ (Cyber Security) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బజాజ్ ఫిన్ సెక్యూరిటీస్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు (Cyber Security) ముగ్గురుని అరెస్ట్ చేశారు. నిందితులు రూ.3.25 కోట్లు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. కాజేసిన డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు కాంబోడియాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.