రైతును రారాజును చేయడమే ప్రధాని నరేందర మోడీ లక్షమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా, చొప్పదండిలో శనివారం నిర్వహించిన సైకిళ్ల పంపిణీ, కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. టెన్త్ విద్యార్థులకు సైకిళ్లను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం… రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు దాదాపు రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోడీ సర్కార్‌కే దక్కిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయని అన్నారు.
అయినా రైతులపై ఒక్క పైసా అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అతి తక్కువ ధరకే ఎరువులను సరఫరా చేస్తోందని అన్నారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఒక్కో ఎకరాకు 18 వేల చొప్పున రైతులకు ఆదా అవుతోందని అన్నారు. 5 ఎకరాలున్న రైతుకు ఒక్క సీజన్‌కే 90 వేల రూపాయలు ఆదా అవుతోందని అన్నారు. మోడీ ప్రభుత్వం 11 ఏళ్లలో వడ్లు, గోధుమలు సహా రైతులు పండించే పంటలన్నింటికీ కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేసిందన్నారు. టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతోందని అన్నారు. ఢిల్లీలో చాలామంది ఎంపిలు ఇదే విషయంపై తనను అడుగుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పేదలను ఆదుకునేందుకు యత్నిస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
సైకిళ్ల పంపిణీ చేయడానికి నిర్మల్ పాదయాత్రలో ఎదురైన అనుభవాలే కారణమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులున్నారని, అందులో చదివితే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివి టెన్త్ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు భవిష్యత్తులో ఇంటర్ విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, జిల్లా ఉన్నతాధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారణాసి నుండి కిసాన్ ఉత్సవ్ దివస్‌లో చేసిన ప్రసంగాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు.