టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక భారత్‌కు దౌత్యపరమైన పరీక్షగా తయారైంది. వారసుడి ఎంపికకు తమ ఆమోద ముద్ర తప్పనిసరి అంటూ చైనా చేసిన డిమాండ్‌ను భారత్ తోసిపుచ్చింది. 15వ దలైలామాను ఎన్నుకునే అధికారం ఇప్పటి దలైలామాదే తప్ప మరెవరికీ లేదని భారత్ స్పష్టం చేసింది. దలైలామా బుధవారం తన వారసుడి ఎంపికపై కీలక ప్రకటన చేస్తూ తన పునర్జన్మ (రీ ఇంకార్నేషన్)కు గుర్తింపు ఇచ్చే ఏకైక హక్కు తమ అధికారిక గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని, మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పరోక్షంగా చైనాను హెచ్చరిస్తూ స్పష్టం చేశారు. కొత్త దలైలామాను ఎంపిక చేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను ఆయన వ్యతిరేకించారు. అయితే దలైలామా ప్రకటనకు వెంటనే చైనా స్పందించింది. దలైలామా వారసుడిని ఎంపిక చేయడానికి తమ సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పేర్కొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో చైనా టిబెట్ మధ్య మరో కొత్త సంఘర్షణ మొదలవుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. దలైలామా పరంపరకు 600 ఏళ్ల చరిత్ర ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని వ్యవస్థ ఎంపిక కన్నా దలైలామాకే ఎంపిక అవకాశం కల్పించే నైతికతకు భారత్ మద్దతు ఇవ్వాల్సి ఉంది. భారత్ చైనా మధ్య టిబెట్ వివాదం సుమారు 70 ఏళ్లుగా నడుస్తోంది. 13వ శతాబ్ద కాలంనుంచి టిబెట్ తమ దేశంలో భాగంగానే ఉందని చైనా వాదిస్తోంది. 1950 అక్టోబరులో టిబెట్‌ను భారత్ (India annexes Tibet) ఆక్రమించుకోందని చైనా ఆరోపించడంతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటిష్ ప్రభుత్వం సలహాపై టిబెట్ అంశంపై దాదాపు చేతులెత్తేశారు. సైనిక సాయం లేకుండా టిబెట్‌కి ఎలాంటి ప్రయోజనం కలిగించాలన్నా నిర్ణయం తీసుకోవలసింది భారతేనని, టిబెట్ స్వతంత్రతకు గుర్తింపు అన్న ప్రసక్తే ఉండరాదని బ్రిటిష్ ప్రభుత్వం సూచించడంతో టిబెట్‌పై ఆధిపత్యాన్ని పరోక్షంగా చైనాకే నెహ్రూ విడిచిపెట్టారు.
1950లో సామ్యవాద ముసుగులో టిబెట్ విషయంలో చైనాను భారత్ వెనకేసుకు వచ్చిందన్న వాదనలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి టిబెట్‌పై సర్వాధికారం తమదేనని చైనా విర్రవీగుతోంది. 13వ దలైలామా 1912లో టిబెట్‌ను స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించినా, 40 ఏళ్ల తరువాత చైనా టిబెట్‌పై దాడి చేసింది. 14 వ దలైలామా ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఈ దాడి జరిగింది. ఆ యుద్ధంలో టిబెట్ ఓడిపోయింది. 1951 లోనే తమ నియంత్రణలోకి టిబెట్‌ను చైనా తెచ్చుకుంది. 1954లో చైనాతో భారత్‌కు కుదిరిన ఒప్పందంలో టిబెట్‌ను చైనాలోని ప్రాంతంగా గుర్తిస్తూ అంగీకరించింది. చైనా వేధింపులు తట్టుకోలేక 1959లో టిబెట్ నుంచి భారత్‌కు దలైలామా శరణార్థిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం కల్పించడంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఎంతో సాయపడ్డారు. వేలాది మంది అనుచరులైన టిబెటన్లతో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.
దలైలామాపై చైనా వేర్పాటువాది, తిరుగుబాటుదారుడు అనే ముద్రవేసింది. భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో భారతదేశ టిబెట్ విధానంలో మార్పు వచ్చింది. భారత ప్రభుత్వంతో కలిసి దలైలామా చురుకుగా వ్యవహరించడం చైనాకు నచ్చడం లేదు. చైనా గత కొన్నేళ్లుగా తదుపరి దలైలామా ఎంపిక తమదేనని వాదిస్తోంది. టిబెట్‌ను పూర్తి స్వయం ప్రాతిపదిక ప్రావిన్స్‌గా ‘జిజాంగ్’ పేరుతో వ్యవహరిస్తోంది. బౌద్ధమత మఠాలను తన అధీనంలో ఉంచుకుంది. బౌద్ధ భిక్షువులైన లామాలపై తమ పెత్తనం సాగించడానికి కఠినమైన నిబంధనలను విధిస్తోంది. ‘జిజాంగ్‌లో మానవ హక్కుల కొత్త యుగం’ పేరుతో శ్వేతపత్రాన్ని ప్రకటించి టిబెట్‌లోని చట్టపరమైన, మతపరమైన వ్యవహారాలకు రక్షణగామార్గదర్శకాలను సూచించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దలైలామా ఎంపికకు మద్దతు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. తాము నియమించే దలైలామాకే చట్టపరమైన అధికారం ఉంటుందని చైనా వాదిస్తోంది.
చైనాకు చెందిన పిఎల్‌ఎ వెస్టర్న్ థియేటర్ కమాండ్‌కు టిబెట్ రీజియన్‌లో గట్టి పట్టు ఉంది. ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా దలైలామా ఎంపిక జరిగితే తీవ్ర సంఘర్షణలకు దారి తీయవచ్చు. తమ చెప్పుచేతల్లో నడిచే దలైలామా ఉండాలని చైనా ఆరాటపడుతోంది. అయితే దలైలామా వ్యవస్థను రద్దు చేసే మార్గంలో చైనా వెళ్లే అవకాశం లేదు. అందువల్ల ప్రస్తుతం ఉన్న బౌద్ధుల్లో దలైలామాను ఎంపిక చేయడానికి 2016 లో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వ్యవస్థను అనుసరించవచ్చు. దానికి అనేక మంది అర్హులమని పోటీపడితే బంగారు కలశంలో లాటరీ ద్వారా ఎంపిక చేయవచ్చు. చైనాలో పూర్వం టిబెట్ లామాలను ఎంపిక చేయడానికి బంగారు కలశం లాటరీ పద్ధతి అనుసరించేవారు. చైనాలో 1793లో ఈ పద్ధతి ఉండేది.
కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను అనుసరించే దలైలామాను రాజకీయ ప్రాధాన్యంలో గుర్తించవచ్చు. ఇంకా ప్రస్తుత దలైలామా ట్రస్ట్ గాడెన్ ఫ్రోడాంగ్ ఎంపిక చేసిన దలైలామాతో సన్నిహితంగా మసలే మరో దలైలామాను చైనా ఎంపిక చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నైతికపరంగా తమ దౌత్యవిధానానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాత్మక మార్గం లో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దలైలామా ట్రస్ట్‌కే అధికారం కేంద్రీకృతమైన ప్రస్తుత సమయంలో ఈ ఎన్నిక చిత్రం నుండి దూరంగా భారత్ ఉంటుందని అనుకోవడం అవివేకమే అవుతుంది. టిబెట్ బౌద్ధ సమాజానికి దలైలామాను ఎంపిక చేసుకునే మత స్వేచ్ఛను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత భారత్‌దే.