Tuesday, July 8, 2025

దలైలామా వారసత్వం.. తగని చైనా జోక్యం

- Advertisement -
- Advertisement -

టిబెట్ ఆధ్యాత్మక నాయకుడు దలైలామా -టెన్జిన్ గయాట్సో- 2025 జులై 2న తన 90వ పుట్టినరోజు సమీపిస్తున్న తరుణంలో చేసిన చారిత్రాత్మక ప్రకటన, ఆధ్యాత్మిక, భౌగోళిక రాజకీయ రంగాలలో ప్రతిధ్వనించింది. భారతదేశంలోని ధర్మశాలలో మూడురోజుల టిబెటన్ మత సదస్సు సందర్భంగా ఇచ్చిన వీడియో సందేశంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 2011లో తాను స్థాపించిన స్వచ్ఛంద సంస్థ గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు మాత్రమే తన వారసుడిని గుర్తించే ఏకైక అధికారం కలిగి ఉంటుందని, ఇతరులకు, ముఖ్యంగా చైనా జోక్యాన్ని స్పష్టంగా తిరస్కరిస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిబెటన్ బౌద్ధులు స్వాగతించారు. తదుపరి దలైలామాను ఆమోదించే హక్కును స్పష్టం చేసిన ప్రకటన చైనా తీవ్ర ప్రతిచర్యకు దారితీసింది.

ఈ ప్రకటన టిబెటన్ బౌద్ధ సంప్రదాయాలను పరిరక్షించడంలో దలైలామా నిబద్ధతను నొక్కి చెప్పింది కానీ, భారతదేశం, చైనా, టిబెటన్ ప్రవాస సమాజం (Tibetan diaspora) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను హైలైట్ చేస్తుంది. భారత ఈశాన్య ప్రాంతాలు లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాలపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాసం దలైలామా తన పుస్తకం వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్‌లో వ్యక్తం చేసిన వైఖరిని, లడఖ్, ఈశాన్య భారతదేశంలోన చైనా దూకుడు విధానాలను, భారతదేశం, హిమాలయ సరిహద్దులపై విస్తృత రాజకీయ ప్రభావాలను విశ్లేషిస్తుంది. దలైలామా వారసత్వ ప్రణాళిక, గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ టిబెటన్ బౌద్ధమతం, ఆధ్యాత్మిక, సాంసృ్కతిక మూలాలైన 600 సంవత్సరాల ప్రాచీన దలైలామా వ్యవస్థ భవిష్యత్‌పై దలైలామా ప్రకటన స్పష్టమైన వైఖరిని సూచిస్తుంది. తన పూర్వజన్మను గుర్తించే బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కు అప్పగించడం ద్వారా, దలైలామా ఈ ప్రక్రియ నుంచి రాజకీయాలను ముఖ్యంగా చైనా ప్రభుత్వం నుంచి రక్షించడానికి ప్రయత్నించారు.

ధర్మశాలలో ప్రధాన కార్యాలయం ఉన్న గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ 1959 వరకూ దలైలామాల నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వం, చారిత్రాత్మక గాడెన్ ఫోడ్రాంగ్ వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఈ ట్రస్ట్ దలైలామా వ్యక్తిగత వ్యవహారాలను నిర్వహిస్తుంది. టిబెటన్ బౌద్ధమతాన్ని ప్రోత్సహిస్తుంది. విద్య, ఆరోగ్యం కల్పన కార్యక్రమాల ద్వారా టిబెటన్ ప్రవాస సమాజం సంక్షేమానికి కృషి చేస్తుంది. దలైలామా ఈ మధ్య 2025 లో ప్రచురించిన తన పుస్తకం వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్‌లో తన వారసత్వంపై స్పష్టమైన దృక్పథాన్ని వివరించారు. టిబెటన్ బౌద్ధమతం సమగ్రతను కాపాడేందుకు, టిబెటన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి చైనా వెలుపల స్వేచ్ఛా ప్రపంచంలో తన పునర్జన్మ జరగాలని నొక్కి చెప్పారు. పూర్వజన్మ ఉద్దేశం పూర్వీకుల పరంపరగా వస్తున్న పనిని కొనసాగించడం అని పుస్తకంలో రాశారు.

అలాగే కొత్త దలైలామా స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తారు. తద్వారా దలైలామా సాంప్రదాయం లక్ష్యమైన సార్వత్రిక కరుణకు గొంతు లభిస్తుంది. టిబెటన్ బౌద్ధ మతం ఆధ్యాత్మిక నాయకుడు, టిబెటన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే టిబెట్ చిహ్నం కొనసాగుతుందని తన పుస్తకంలో ఆయన రాశారు. దలైలామా వారసుడిని ప్రభుత్వ నియంత్రణలోని గోల్డెన్ ఉర్న్ ప్రక్రియ ద్వారా ఆమోదించాలని చైనా వాదనకు ఈ ప్రకటన సవాల్ వంచిది. ఇది టిబెటన్ బౌద్ధ పునర్జన్మలపై అధికారాన్ని నొక్కి చెప్పేందుకు చైనా తిరిగి ప్రవేశపెట్టిన క్వింగ్ రాజవంశ ఆచారం. దలైలామా ప్రకటనకు ప్రవాసంలో ఉన్న, టిబెట్‌లో ఉన్న బౌద్ధులనుంచి చక్కటి మద్దతు లభించింది. వారు ఈ ప్రకటనను ఆధ్యాత్మిక స్వయం ప్రతిపత్తిని ధ్రువీకరించడంగా భావిస్తున్నారు. ధర్మశాలలోని టిబెటన్ యువకుడు పెమా ఉర్గెన్ మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.

దలైలామా పవిత్ర వారసత్వం చుట్టూ తప్పుడు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన చెక్ పెట్టారని, టిబెటియన్లకు ఆయనన మా శాసనం అని అన్నారు. అయితే ఈ నిర్ణయం దలైలామాను వేర్పాటు వాదిగా భావిస్తూ, టిబెట్‌పై పట్టునిలుపుకునేందుకు పునర్జన్మ ప్రక్రియను నియంత్రించాలని కోరే చైనా ఉద్రిక్తతలను పెంచింది. దలైలామా ప్రకటనకు చైనా ప్రతిస్పందన పూర్తిగా ఊహించనట్లుగానే ఉంది. దలైలామా వారసుడు, మతపరమైన ఆచారాలు, చారిత్రక సంప్రదాయాలను, గోల్డెన్ ఉర్న్ ప్రక్రియ, చైనా ప్రభుత్వ ఆమోదంతో, చైనా చట్టాలకు అనుగుణంగా సాగాలన్న వైఖరిని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్ పునరుద్ఘాటించారు. ఈ వైఖరి టిబెటన్ బౌద్ధ మతాన్ని చైనిసైజ్ చేయాలనే చైనా వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది.దానిని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) సైద్ధాంతిక చట్రంలో ఇరికించే యత్నం చేస్తోంది.

దలైలామా పునర్జన్మలపై అధికారం ఉందని చైనా వాదన క్వింగ్ రాజవంశం నాటిది. అయితే దీనిని దలైలామా, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్‌తో పాటు, విమర్శకులు అంగీకరించడం లేదు. గోల్డెన్ ఉర్న్ అనేది చాలా తక్కువగావాడే రాజకీయ సాధనం. సాంప్రదాయ టిబెటన్ ఆచారాలలో దానికి చట్టబద్ధత లేదని వాదిస్తున్నారు. టిబెటన్ బౌద్ధమతంలో చైనా జోక్యం కొత్తకాదు. 1995లో దలైలామా ఆరేళ్ల బాలుడిని టిబెటన్ బౌద్ధమతంలో రెండో అత్యున్నత వ్యక్తిగా, 11వ పంచన్ లామాగా గుర్తించిన తర్వాత, చైనా అధికారులు ఆ పిల్లవాడిని, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత మళ్లీ వారు ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. ఆ తర్వాత చైనా తన సొంత పంచన్ లామాను నియమించింది. కానీ ఈ చర్యను టిబెటన్లు తిరస్కరించారు. దలైలామా ఇటీవల చేసిన ప్రకటన ఇలాంటి పరిస్థితిని తప్పించే ఉద్దేశంతో చేసిందే.

కానీ ఇద్దరు దలైలామాలు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ ద్వారా గుర్తించిన వ్యక్తి, చైనా నియమించిన వ్యక్తి. టిబెటన్ సమాజంలో విభేదాలను తీవ్రతరం చేసే, చట్టబద్ధ వారసుడికి ప్రపంచ గుర్తింపు కష్టసాధ్యం చేసే అవకాశంఉంది. టిబెటన్ బౌద్ధమతంపై చైనా నియంత్రణ కేవలం పునర్జన్మలను కన్నా టిబెటన్ స్వయం ప్రతిపత్తి రీజియన్‌లోని సాంసృ్కతిక, మతపరమైన అణచివేతలకు దారితీసింది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ బౌద్ధ మత మఠాలను కూల్చేసింది. మతపరమైన ఆచారాలపై ఆంక్షలు విధించింది. బౌద్ధ సన్యాసులు, సన్యాసినులపై గట్టి నిఘా పెట్టింది. చైనా పాలనకు వ్యతిరేకంగా టిబెటన్ ల తిరుగుబాటు విఫలమైన తర్వాత, 1958లో దలైలామా బహిష్కరణ ఓ మలుపు. వేలాదిమంది టిబెటన్లు, భారతదేశానికి ఇతర దేశాలకు పారిపోయారు.

దలైలామా తన పుస్తకం వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్‌లో టిబెట్‌లో చైనా కమ్యూనిస్ట్ పాలనలో అణచివేతలగురించి విచారం వ్యక్తం చేస్తూ, మధ్యేమార్గంగా తన విధానం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, టిబెట్‌కు పూర్తి స్వాతంత్య్రం కాకున్నా, అర్థవంతమైన స్వయం ప్రతిపత్తిని సమర్థించారు. అయితే చైనా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆధ్యాత్మక విషయాలనూ నియంత్రించాలని, టిబెటన్ గుర్తింపును తుడిచిపెట్టి దలైలామా ప్రభావాన్ని నిర్వీర్యం చేయాలన్న తన ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నది. చైనా కఠిన వైఖరి, విధానాలు టిబెట్‌ను దాటి, భారతదేశ హిమాలయ సరిహద్దులవరకూ, ముఖ్యంగా చాలా మంది టిబెటన్ బౌద్ధ జనాభా ఉన్న లడఖ్, అరుణాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాల వరకూ పాకాయి. ముఖ్యంగా 2020లో లడఖ్ సమీపంలో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత చైనా సైనిక దురాక్రమణ ఉద్రిక్తతలను పెంచింది. ఈ ఘర్షణలో 20 మందికిపైగా భారతీయ సైనికులు, లెక్కలేనంత మంది చైనా సైనికుల చావులకు దారితీసింది.

దీంతో భారత – చైనా సంబంధాలు మరో మెట్టు దిగజారాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దు రేఖ వెంబడి చైనా దళాలను మోహరించి, సైనిక స్థావరాలు, నిర్మాణాల చేపట్టడం ద్వారా ఆ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి చైనా వ్యూహాలను సూచిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని టిబెట్, భారతదేశం క్లైమ్ చేస్తున్నా, చైనా ఆక్రమణలో అక్సాయ్ చిన్ పీఠభూమికి దగ్గరగా ఉండడంతో వ్యూహాత్మకంగా కీలకమైనదిగా భావిస్తున్నారు. కానీ, అరుణాచల్‌ప్రదేశ్‌ను చైనా దక్షణ టిబెట్‌గా పేర్కొంటోంది. ముఖ్యంగా ఆరో దలైలామా జన్మించిన టిబెటన్ బౌద్ధమతానికి కేంద్రమైన తవాంగ్ వంటి ప్రాంతాలపై చైనా తన వాదనను తీవ్రతరం చేసింది. 2017లో భూటాన్ సమీపంలోని డోక్లామ్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించడం భారతదేశంతో 73 రోజుల ప్రతిష్టంభనకు దారితీసింది.

ఈశాన్య ప్రాంతాలను కబ్జా చేయాలన్న చైనా ఆశలను ఇది స్పష్టం చేసింది. ఈ చర్యలు చైనా దురాక్రమణలో భాగం, వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల సమీపంలో గ్రామాల నిర్మాణం, చారిత్రక వాదనలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో పలు ప్రాంతాల పేర్లు మార్చడం వంటి పలు దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. దలైలామా వారసత్వ ప్రణాళిక, చైనా ప్రతిచర్య భారతదేశానికి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలపై తీవ్ర రాజకీయ ప్రభావాలను కలిగించవచ్చు. గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తన పునర్జన్మను పర్యవేక్షిస్తుందన్న దలైలామా ప్రకటన ఆధ్యాత్మిక స్వయం ప్రతిపత్తి విషయంలో ధైర్యంగా చేసిన ప్రకటన, టిబెటన్ బౌద్ధమతాన్ని నియంత్రించేందుకు చైనా ప్రయత్నాలకు గట్టి ప్రతిఘటన. ఆయన వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ లో వ్యక్తం చేసిన స్వేచ్ఛా ప్రపంచంలో జన్మించిన వారసుడి విషయంలో ప్రకటన టిబెటన్ గుర్తింపు కాపాడుకునే ఆయన దృష్టిని వెల్లడిస్తుంది. టిబెట్ సాంసృ్కతిక నిర్మూలనను నిరోధించడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తున్నది.

లడఖ్, ఈశాన్య భారతదేశంలో చైనా దూకుడు విధానాలు, దాని ప్రాదేశికవాదనలు, టిబెటన్ మతపరమైన వ్యవహారాలలో జోక్యం, ఆధ్యాత్మిక, భౌగోళిక రాజకీయ సంఘర్షణలను హైలైట్ చేశాయి. భారతదేశం విషయానికి వస్తే, దాలైలామా వారసత్వ ప్రణాళిక టిబెటన్ బౌద్ధ వారసత్వం సంరక్షకుడిగా ఆయన స్థానాన్ని బలోపేతం చేస్తుంది. కానీ, దౌత్యసవాల్‌లో ముందంజలో ఉంచుతుంది. టిబెటన్ ప్రవాస సమాజం, హిమాలయ బౌద్ధ జనాభా దలైలామా దార్శినికతకు మద్దతు ఇస్తున్నందువల్ల ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక సంస్థలలో ఒకటైన సంస్థ భవిష్యతైపై వివాదాస్పద యుద్ధానికి వేదిక సిద్ధమైంది. ఇది భారతదేశం, చైనా, ప్రపంచ బౌద్ధ సమాజాలపై విస్తృతమైన ప్రభావం చూపవచ్చు.

  • గీతార్థపాఠక్ (ఈశాన్యోపనిషత్)
  • రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News