Wednesday, September 10, 2025

జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన ప్రతిపక్షానికి సిట్టింగ్ సీటు. ఇక్కడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సానుకూల సంకేతాలు పంపించే కోణం దానం నాగేందర్‌ను ఉప ఎన్నికల అభ్యర్థిగా బరిలోకి దించే అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తోన్నట్టు ఆ పార్టీ ఉన్నతస్థాయి వర్గాల సమాచారం.

ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, మూడు నెలలలో ఈ అంశంపై చర్య తీసుకోవాల్సిందిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా జారీ చేసారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దానం నాగేందర్‌తో సహ 9 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తాము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, ఇప్పటికీ బీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిసినట్టు వెల్లడించారు.

ఈ వాదన ఒక్క దానం నాగేందర్ విషయంలో చెల్లుబడి అయ్యే అవకాశం లేకుండా పోయింది. తన ఎమ్మెల్యే పదవికి, బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా పోటి చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎమ్మెల్యేల మాదిరిగా వాదించే అవకాశం దానం నాగేందర్‌కు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా న్యాయనిపుణులు గుర్తు చేసినట్టు తెలిసింది. అయినప్పటికీ తనను నమ్మి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏ విధంగా అయినా కాపాడుకుంటున్నానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. దీంట్లో భాగంగానే దానం నాగేందర్‌ను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించే వ్యూహరచన చేస్తోన్నట్టు తెలిసింది. ఇలా చేయడం ద్వారా ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానంతో పాటు మిగతా ఎమ్మెల్యేలను తప్పించ వచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఈ వర్గాల సమాచారం.

అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను నిర్వహించి అక్కడ విజయం సాధించడం ద్వారా కాంగ్రెస్‌కు సానుకూల వాతవరణం ఉందన్న సంకేతం ఇవ్వాలన్నది కాంగ్రెస్ పెద్దల ద్విముఖ వ్యూహమని ఈ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అభ్యర్థిగా ఎవరిని దించితే బాగుంటుందనే అంశంపై కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తెప్పించుకున్న సర్వేలోనూ దానం నాగేందర్ అభ్యర్థిత్వం పట్ల అందరికంటే ఎ క్కువగా ఓటర్లు మొగ్గు చూపినట్టు తేలిందని తెలిసింది. పైగా తనకు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ఖైరతాబాద్‌కు జరుగబోయే ఉప ఎన్నికలలో అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకుంటానని దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇచ్చినట్టు కూడా ఈ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News