పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉగ్రవాద దాడిని ఖండించనందుకు పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌ను మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా విమర్శించారు. “పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధానమంత్రి ఇంకా దానిని ఎందుకు ఖండించలేదు?. అకస్మాత్తుగా సైన్యాన్ని ఎందుకు అప్రమత్తం చేశారు. ఎందుకంటే.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ పెంచి పోషిస్తున్నారని మీకు తెలుసు. సిగ్గుపడాలి” అని మాజీ క్రికెటర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కాగా, జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్న వారు ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని భారత్ తీవ్రంగా హెచ్చరించింది.