Monday, July 28, 2025

రైైతు పక్షపాతి దాశరథి

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రానంతర ఆధునిక తెలుగు కవులలో డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు ప్రముఖులు. ఆయన దాశరథిగా ప్రసిద్ధులు. ఆయన కేవలం కవే కాదు, తెలంగాణ వి మోచన ఉద్యమకారుడు కూడా. దాశరథి ఒకవైపు కలం, మరోవైపు ఉద్యమం జీవితంగా గడిపినవా రు. దాశరథి అభ్యుదయ కవి. ఆయన తొలి కావ్యం ‘అగ్నిధార’ (1949) వచ్చేనాటికి తెలంగాణాలో సాయుధ పోరాటం కొనసాగుతున్నది. ‘అగ్నిధార’లో దాశరథి రైతుల పక్షం వహించి, తన శ్రామికవర్గ ప్రీతిని చాటుకున్నారు. ‘తెలంగాణ ము రైతుదే’ అని ప్రకటించారు. రైతుల శ్రమను దాశరథి అభినివేశంతో వర్ణించారు.
‘ప్రాణములొడ్డి ఘోర
గహనాటవులన్ బడగొట్టి మంచి
మాగాణములన్ సృజించి,
ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని’,
అంటూ ‘అగ్నిధార’లోనే దాశరథి మరోసారి ‘హాలికా! వేనవేల దండాలు నీకు’ అని జేజేలు పలికారు. పంటలు పండించడానికి రైతు రాత్రింబవ ళ్లు పడే శ్రమను దాశరథి రైతులోకి పరకాయ ప్రవేశం చేసి వర్ణించారు.
‘పంట పొలాలలోన తెలవారు
నిద్దురకాచి, వేకువన్
ఇంటికి వచ్చి, చల్ది మెతుకెంగిలి
చేసియొ చేయకో పశుల్
వెంటబడంగ కాననము వీధుల
బోయెడి కాపు బిడ్డ!
నీ వంటి స్వయం ప్రపోషణ
విభావము రాజులకబ్బజాలునే’
ఈ పద్యంలో కవి రైతును స్వతంత్ర జీవిగా భావించారు. ఆ స్వతంత్రత క్రమక్రమంగా కృశించిపోయి ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చేసింది. ‘అనంత సంగ్రామం’ కవితలో దాశరథి భారతదేశంలోని వర్గ సమాజాన్ని చిత్రిస్తూ
‘సేద్యం చేసే రైతుకు
భూమి లేదు, పుట్ర లేదు
రైతుల రక్తం తాగే జమీందారులకెస్టేట్లు’
అన్నారు.
ఈ కవిత రాసే కాలం నాటికి తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం, ఆంధ్ర ప్రాంతంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమం నడుస్తున్నాయి. ఈ ఉద్యమాలే కవులు రైతుల పక్షం వహించేట్లు చేశాయి.
1950 నాటి ‘రుద్రవీణ’లో దాశరథి సుప్రభాతం, కవాటం, మహాగీతం, రుధిర దీపిక వంటి కవితలలో రైతు శ్రామిక జీవితాన్ని చిత్రించి రైతులకు ప్రబోధం చేశారు. ‘సుప్రభాతం’లో నాగలి కర్రు రుచిచూసిన భూమి పెదవుల తీపి ఏదో సాక్ష్యం చెబుతున్నది వినమని విజ్ఞప్తి చేశారు.
‘నాగేటి చాళ్లలో నడిచే రైతులారా!
మీ నిశ్శబ్ద గళాలు పాడిన
గీతా రహస్యాలను
వజ్రలోకానికి వినిపించే నా రుద్రవీణ ఇదే’
అని రైతులకు కవి భరోసా ఇచ్చాడు. ‘కవాటం’ కవితలో రైతులను రుద్రులతో పోల్చారు. 1953 నాటి ‘మహాంధ్రోద యం’ కావ్యంలో అదే పేరుతో కవిత ఉంది. అందులో
‘శ్రామిక హృదయాంతర్మహా
బడబాగ్ని ఉరుకులో
పెట్టుదారులు
కృషిక సీర నిశాతముఖమున
క్రుమ్మి నట్టి పొలాల బారులు’
అని ఒక ఆశాభావాన్ని ప్రకటించారు దాశర థి. తెలంగాణ నిజాం నుంచి విముక్తమైన ఆ మంచి సందర్భంలో ఆయన
‘కృషికుల్ కార్మికులెల్ల రొక్కటిగ
సంగీతమ్ములంబాడుడు
అని ప్రబోధించారు ‘కోటి గొంతులు’ కవితలో ‘మంజీర’ కవితలో మంజీర నదీ ప్రవాహం తెలంగాణలో తీసుకొచ్చే మార్పులను వర్ణిస్తూ ‘ఇక ఎన్ని చెరుకు తోటలు పండవీచోట’ అని పరవశించిపోయారు. కాపయ నాయకుని యుద్ధ నైపుణ్యా న్ని వర్ణిస్తూ ఆయనకు రైతులు ఇచ్చిన తోడ్పాటును కూడా దాశరథి ఉద్రేకంతో వర్ణించారు.
‘రైతులే ఖడ్గధారా ధాళ ధళ్యమ్ము
తోప సేనానులై తోడురాగ’ అన్నారు
రాచరిక వ్యవస్థలో రైతులు పంటలు పండించడమే గాక, అవసరమైనప్పుడు యుద్ధంలో రాజు కు అండగా పాల్గొనే ప్రాచీన విలువను కవి ప్రస్తావించాడు.
1961 నాటి ‘పునర్నవం’ కావ్యంలో దాశర థి ‘రూపాయికి విలువ లేని రోజు రేపు వస్తుందట’ అనే కవితలో పాలకుల పెట్టుబడిదారీ బుద్ధులను విమర్శిస్తూ ‘రాజుల మాటే గాని రైతుమాట వినం వినం’ అని దెప్పి పొడిచారు. రైతు క్రమంగా పాలకుల నిరాదరణకు గురికావడాన్ని దాశరథి ఆనాడే గుర్తించడం విశేషం. ‘మస్తిష్కంలో లేబరేటరీ’ కవితలో
‘రాజుల పాదాల క్రిందుగా పరచిన
రైతుల రతనాల బ్రతుకుల తివాచీలు’
అన్నారు. నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీల దోపిడీకి రైతులు కుదేలవ్వడా న్ని కవి గుర్తు చేసుకున్నాడీ కవితలో.
‘నిన్న రాజుల్ని ఎదిరించిన వారు
నేడు రాజులకు బహు దగ్గరివారు’
అని మారిన పరిస్థితిని ప్రస్తావించారు దాశర థి. ఈ కవితలో ఆయన ‘అనంత సంగ్రామం’ కవితను యథాతథంగా పునరుక్తం చేశారు. ఇదలా ఉంచుదాం. ‘జ్యోతిశ్చక్రం’ కవితలో రైతుల తిరుగుబాటును గుర్తు చేశారు.
‘రాజుల సమ్రాట్టుల కిరీటి తోటి
రైతులు ఎత్తేస్తారు చెత్త తోటి’
అని ధైర్యంగా చెప్పారు. కర్షకుడు పల్లెలో బతకలేక నగరాలకు పోయి కార్మికుడిగా మారినా బతకడం కష్టమైపోతున్న తీరును కవి వర్ణించారు. ‘అశ్రుదీపం’ కవితలో వర్తమాన సామాజిక స్థితి ఎంత ఘోరంగా ఉన్నదో చెబుతూ, రైతులు పండించిన పంటను కొనడంలో దళారీలు అనుసరించే దుర్మార్గాన్ని
‘ధాన్యాల అమ్మకంలో కొనుగోలులో
నాణేల మలేరియా దోమ’
అని విమర్శించారు.
‘అమృతాభిషేకం’ కావ్యంలో ‘ఆశాసౌధం’ కవితలో, భవిష్యత్తు మీద ప్రజలకు నమ్మకం, ఆశ కలిగించే ప్రయత్నం చేశారు కవి. అందులో పేద రైతులను కూడా చేర్చారు.
‘కొంపలు గోడలు లేని కూలీ రైతులారా!
అంతా రండయ్యా నా ఆశా సౌధంలోకి’
అని ఆహ్వానం పలికారు. శ్రామిక వర్గంలోని రైతుల పట్ల కవికి ఎంత మమకారం ఉందో ఇలాంటి వాక్యాలు తెలియజేస్తాయి. ‘కవితా పుష్పకం’ కావ్యంలో ‘సంక్రాంతి సుందరి’ కవితలో పంటలు బాగా పండితే కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పారు.
‘పంట చేలో వింత సోయగం
ఇంటిలో వాల్గంటి సంబరము’
1973 నాటి ‘తిమిరంతో సమరం’ కావ్యంలో ‘మనిషీ- పని- మనీ’ కవితలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడి రైతాంగాన్ని ఎలా సంక్షోభంలోకి నెట్టివేస్తున్నదో చెప్పారు దాశరథి.
‘చలిలో ఆకలితో
కడుపు కోతతో కాలువ వొడ్డంట
కదలి వెళుతున్న వ్యవసాయ కార్మికుడా!
నీ కన్నీరే కృష్ణ కాలువ
ఈ లోకమెరుగదు నీ విలువ’
అని వ్యవసాయ కూలీ శ్రమ విలువను ఉదాత్తంగా చెప్పారు. రైతులను అనేక పార్శ్వల నుంచి వర్ణించిన దాశరథి రైతును కేవలం తిండిగింజలు పండించే ఉత్పత్తి శక్తిగానే గాక, సమాజ పరివర్తన ఉద్యమంలో భాగస్వామిగా కూడా గుర్తించారు. సామ్యవాదం రావాలంటే రైతు కూడా కావాలి అని ‘ఆలోచనాలోచనాలు’లో స్పష్టంగా చెప్పారు.
‘కంఠశోషతో రానేరాదు సోషలిజం’
‘రైతు కూలి మేధావులు
కలపండి భుజం భుజం’
అని పిలుపిచ్చారు. దాశరథి వ్యవసాయ వర్గానికి చెందినవారు కాకపోయినా, అప్పటి అంతర్జాతీయ వాతావరణం ఆయనను రైతు వైపు మళ్ళించింది.
(డా.దాశరథి శతజయంతి సందర్భంగా)
గుత్తా హరిసర్వోత్తమ నాయుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News