తెలంగాణ విముక్తి పోరాట కవిత్వానికి ఊపిరిపోసిన సాహితీవేత్తల్లో అగ్రస్థానం దాశరథి కృష్ణమాచార్యకే దక్కుతుంది. నిజాం రాజు నిరంకుశత్వంపై అంకుశంలా పద్యాన్ని పదునెక్కించిన ఘనత ఆయనదే. ‘రుద్రవీణ’ను మోగించి, ‘అగ్నిధార’ను కురిపించి తెలంగాణ ప్రజల్లో చైతన్య స్రవంతిని ప్రవహింప చేశారు. పీడిత ప్రజాపక్షం వహించి తెలంగాణ అస్తిత్వానికి జీవం పోయడానికి నిరంతరం శ్రమించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదిస్తూ నిజాం కర్కశపాలనపై పద్యం అనే ఖడ్గాన్ని ఝళిపించారు. అటువంటి మహాకవిని కలుసుకోవడం, మాట్లాడడం, సూచనలు పొందడం నిజంగా అపురూపమైన ఘట్టం. ఆ మధురస్మృతులను మళ్లీ గుర్తుకు తెచ్చుకునే అవకాశం లభించింది. ఎప్పుడో నలభైఐదేళ్ల క్రితం నాటి మాట.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఆస్థాన కవిగా దాశరథి రాణించిన సమయంలో విశాఖపట్టణం ఆయన రావడం, సాహితీ అభిమానులంతా ఆయనకు బ్రహ్మరథం పట్టడం (Taking Brahmaratha) మరపురాని సంఘటన. దాశరథిని కలుసుకుని అప్పటికి మేం రాసిన కవితలను చూపించాలని ఎంతో కోరికగా ఉండడంతో నేనూ నా సహచరుడు అప్పారి మురళీ క్రిష్ణ ఎలాగోలా ఆయనను కలుసుకోవాలనుకున్నాం. నేను పద్యాలు, గేయాలు కొద్దికొద్దిగా రాస్తుండే వాడిని.. అప్పారి మురళీక్రిష్ణ వచన కవిత్వం రాస్తుండేవాడు. విశాఖపట్టణంలో చందూ సుబ్బారావు, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, కెవియస్ వర్మ, పెమ్మరాజు గోపాలకృష్ణ, దాట్ల నారాయణమూర్తిరాజు, తంబు, అల్లం శేషగిరిరావు, అంగర సూర్యారావు వంటి అప్పటి రచయితలతోపాటు వ్యవహారిక భాషా ఉద్యమసారథిగా పేరు గాంచిన పురిపండా అప్పలస్వామి వంటి సాహితీ స్రష్టలతో కూడా తరుచుగా కలుసుకుని రచనలపై చర్చించేవాళ్లం.
ఈ నేపథ్యంలో దాశరథిని ఎలాగైనా కలుసుకోవాలని కాంక్ష పెరిగింది. ఆయన మూడురోజుల పర్యటనలో మొదటి రోజే ఆయనను కలుసుకున్నాం.కానీ ఆయనకు మాతో మాట్లాడ్డానికి వెంటనే తీరిక దొరకలేదు. దాశరథి వచ్చిన మొదటి రోజు విశాఖ జిల్లా పరిషత్ హాలులో పెద్దసభ జరిగింది. వర్ధమాన సాహిత్యంపై ఆయన అనర్గళంగా మాట్లాడారు. సభ పూర్తి కాగానే మేం కలుసుకున్నాం. ఆయన చుట్టూ ఎందరో అభిమానులు వెంటపడుతున్నారు.సరే ఇప్పుడు కాదు. మరునాడు ఆంధ్రా యూనివర్శిటీ ఫ్యాకల్టీ క్లబ్‌లో సభ పూర్తి కాగానే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఆ ప్రకారం ఫ్యాకల్టీ క్లబ్ సదస్సుకు మేం వెళ్లి నిరీక్షించాం. అక్కడ కూడా ఆయనకు తీరిక దొరకలేదు. ఆల్ ఇండియా రేడియో వారు దాశరథిచే ప్రత్యేక కార్యక్రమం చేయించడానికి కాచుకుని ఉన్నారు. దాంతో ఆయన మా ఇద్దరినీ తన కారులో ఎక్కించుకుని విశాఖపట్నం గవర్నర్ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వం దాశరథికి విడిది ఏర్పాటు చేసింది.
అక్కడకు వెళ్లిన వెంటనే ఆయన కాస్త ఫ్రెష్‌అప్ అయి మాతో మాట్లాడడం ప్రారంభించారు. మేం రాసిన కవితలు ఆయనకు చదివి వినిపించాం. అప్పటికి నాకు కొద్దిగా పద్యాలు, గేయాలు, పాటలు రాయడం అలవడింది. ఆ చొరవతోనే సాహసించి ఆయన ఎదుట తెలుగు మహాసభల సందర్భంగా రాసిన గేయం చదివి వినిపించాను.‘ఆంధ్ర సారస్వత విహాయస ప్రాగ్దిశా ముఖ మండలంబున, సాంద్రతేజస్సు అంకురించెను.. అంధకారములంతరించెను… కలువపూలై సకల జగములు, గానసుధలో తేలియాడగ, ఆలపించిన త్యాగరాజుని అమరమంజుల గాన మాధురి చండ్రనిప్పులు మండుకనులనఖండ శౌర్య ప్రకాండులై రిపుమండలిని ఖండించినెత్తుట మడుగులో ఖడ్గాలు కడిగిన ఛండ శౌర్యచరిత్రలాంధ్రుని గుండెలందు ప్రతిధ్వనించెన్’ ఈ విధంగా ఈ గేయం దాశరథికి చదివి వినిపించేను… ఆయన ఎంతో మెచ్చుకున్నారు. భావంతోపాటు శబ్దసౌందర్యం ఆయనకు బాగా నచ్చింది.
వెంటనే ఆయన స్పందించి… dont stop your lyrical flow (మీ కవితా ప్రవాహాన్ని ఆపివేయకండి) అని సూచించారు. ఆ తరువాత అనేక విషయాలు, వర్ధమాన రచనలు, గురించి చర్చ జరిగింది.‘విషము గుప్పించినాడు, నొప్పించినాడు, జన్మజన్మాల బూజు మా నిజాం రాజు’ అని ఎలుగెత్తి కలం కత్తి ఝళిపించారు కదా! ఇప్పుడు ఆ విధంగా కవితలు పదును తేలడం లేదు ఎందుకని? అని ప్రశ్నించగా కాలానికి తగ్గట్టు పద్యాలు, గేయాల కన్నా ప్రజల నాలుకపై నాట్యమాడే జానపదాలే ఆదరణ పొందుతాయని దాశరథి నిర్మొహమాటంగా చెప్పారు. దీనికి ఉదాహరణగా గద్దర్, బుర్రకథా పితామహుడు నాజర్ కళా సేవను ప్రస్తావించారు. ఆయన రాసిన సినిమా పాటల గురించి కొంతసేపు సంభాషణ సాగింది.
మూగమనసులులో గోదావరి గట్టుంది… గట్టుమీద చెట్టుంది అనే పాటలో వేదాంత అర్థాన్ని దాశరథి విడమరిచి చెప్పారు. గోదావరి గట్టు అనే భూగోళంపై శరీరం ఒక చెట్టు అయితే ఆ శరీరంలో పలికే జీవి ఒక పిట్ట వంటిది అని వివరించారు. అందుకనే ఆ పాటలో ఆత్మ గురించి ఒక చరణం ఇలా ఉంటుంది. ‘పిట్టమనసు పిసరంతైనా పెపంచమంతా దాగుంది. అంతుదొరకని లేత గుండెలో ఎంత తోడితే అంతుందీ’ అని నిగూఢమైన వేదాంతాన్ని గుప్పించారు. ‘ఇద్దరి మిత్రులు’ సినిమాలో దాశరథి రాసిన ఖుషీఖుషీగా నవ్వుతూ పాట ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో ‘నిషా కనుల దాన’ అనే పదప్రయోగం చేశారు. నిషా అంటే మద్యం వల్ల నిషా ఎక్కిందన్న అర్థం వస్తుంది కదా? అని అడగ్గా ప్రేమ వ్యామోహంలో ప్రియురాలి కళ్లు అలాగే కనిపిస్తాయని చమత్కరించారు.
- పి. వెంకటేశం, 99857 25591