జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి లభించే అవకాశం ఉందన్న ఊహగానాలు ప్రారంభమయ్యాయి. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె ప్రయత్నించారు. అప్పుడు గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయ కూడా తన వంతు ప్రయత్నం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. కాగా అప్పుడు టిక్కెట్ ఇవ్వనందున ఇప్పుడు ఉప ఎన్నికలోనైనా పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వాలని దత్తాత్రేయ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతున్నది.
దత్తాత్రేయక బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి విజయలక్ష్మికి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు పలువురు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంతా బిసి రిజర్వేషన్ల పోరాటం జరుగుతున్నది కాబట్టి బిసి బిడ్డ అయిన దత్తాత్రేయ కుమార్తెకు ఇస్తే బాగుంటుందని వారంటున్నారు. దీంతో మహిళకు ఇచ్చినట్లు అవుతుందని వారు చెబుతున్నారు. కాగా దత్తాత్రేయ మాత్రం ఇప్పటి వరకు పార్టీ నాయకత్వాన్ని కోరలేదని తెలిసింది. గతంలో ముషీరాబాద్ సీటు కోసం ప్రయత్నించినందున, ఇప్పుడు మళ్లీ జూబ్లీహిల్స్ కోరితే బాగుండదేమోనని ఆయన భావిస్తున్నట్లు భోగట్టా. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.