జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్ పూర్ రోడ్డులో బాపీ సమీపంలో వ్యాన్ – కంటైనర్ ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో జైపూర్ లో వివిధ ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్ లోని సవాయి మన్ సింగ్ ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎటావా జిల్లాకు చెందిన భక్తులు ఖాటూష్యామ్‌జీ దేవాలయాన్ని సందర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. మృతులలో ఏడుగురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.