మయన్మార్ తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో 427 మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోయినట్టు ఐక్యరాజ్యసమితి శుక్రవారం వెల్లడించింది. మే9,10 తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్టు అంచనా వేసింది. ఈ విషయం నిర్ధారణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాదకర సంఘటనగా ఇది మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్టు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. తొలిప్రమాదం మే 9న చోటు చేసుకోగా, 267 మందిలో 66 మంది బతికి బయటపడినట్టు ప్రాథమికంగా వెల్లడించింది. మే 10 న రెండో నౌక ప్రమాదానికి గురికాగా, 21 మంది బతికి బయటపడినట్టు సమాచారం.
వాస్తవానికి రోహింగ్యాలు.. మయన్మార్‌లో నివసిస్తుంటారు. కానీ సైన్యం మారణహోమం నుంచి తప్పించుకునేందుకు గాను లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. మయన్మార్‌లో గత ఏడాది సైనిక తిరుగుబాటు అనంతరం , వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్ లోని శరణార్థ శిబిరాలు కిక్కిరిసి పోయాయి. అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.2024లో సముద్రం లోనే ప్రమాదం జరిగి 657 మంది రోహింగ్యాలు మృతి చెందారు.