Saturday, August 2, 2025

ఎవరు ఒసిలు, ఎవరు బిసిలు?

- Advertisement -
- Advertisement -

చారిత్రకంగా భారతీయ సమాజం కులవ్యవస్థ ఆధారంగా శతాబ్దాలుగా నిర్మితమై ఉంది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ గతిశీలతలను ప్రభావితం చేస్తున్నది. ఈ వ్యవస్థను ప్రస్తుతం ఓపెన్ కేటగిరీ (ఒసి), వెనుకబడిన కులాలు (బిసి లేదా ఒబిసి), షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టి) అనే వర్గాలుగా విభజించారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1881 నుండి 1931 వరకు నిర్వహించిన జనగణనలు కులఆధారిత జనాభా వివరాల్ని సేకరించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి 2011 వరకు జరిగిన జనాభా లెక్కల్లో కులాల వివరాల్ని నమోదు చేయలేదు. కాబట్టి ఆయా సామాజిక వర్గాలవారీగా ఖచ్చితమైన జనాభా శాతాలపై స్పష్టత లేదు. స్వాతంత్య్ర అనంతరం భారత ప్రభుత్వం కులగణనను నిలిపివేసి, పదేళ్ళకోసారి చేసే జనగణనలో ఎస్‌సి, ఎస్‌టి గణనపై దృష్టి సారించింది.

దీనివల్ల ఒసి, ఒబిసి జనాభా డేటా లభ్యత పరిమితమైందని చెప్పవచ్చు. ఒసి, బిసిల గుర్తింపు సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఒసి కేటగిరి సాధారణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులతో పాటు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందని ఇతర కులాల్ని కూడా సూచిస్తుంది. బిసి లేదా ఒబిసిలు (BC OBCs) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా రాజ్యాంగం ఆర్టికల్ 15(4) కింద నిర్వచించబడ్డాయి. కానీ, కులవర్గీకరణలో కొంత సంక్లిష్టత నెలకొని ఉంది. కేంద్ర జాబితాలో ఒబిసిలుగా గుర్తించబడిన కొన్ని కులాలు వివిధ రాష్ట్రాలలో ఒసి, ఎస్‌సి లేదా ఎస్‌టిలుగా వర్గీకరించడ్డాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1970వ దశకంవరకు బిసి జాబితాలో లంబాడా సామాజిక వర్గాన్ని ఎస్‌టి జాబితాలో చేర్చడం జరిగింది. ఒబిసిలను ఎ, బి, సి, డి, ఇ గ్రూపులుగా విభజించారు.

తెలంగాణలో మున్నూరు కాపులు బిసి జాబితాలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు ఒసి జాబితాలో ఉన్నారు. కర్నాటకలో రెడ్లు బిసి జాబితాలో ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒసిలుగా ఉన్నారు. ఇలా వివిధ కులాలు కేంద్ర, రాష్ట్రాల జాబితాలు వేర్వేరుగా ఉండటం వల్ల ఒక రాష్ట్రంలో ఒసిలుగా ఉన్నవారు, మరొక రాష్ట్రంలో బిసిలు జాబితాలో ఉన్నారు. అదే విధంగా బిసిలుగా ఉన్నవారు మరికొన్ని రాష్ట్రాల్లో మరొక వర్గంలో ఉన్నారు. ఇక్కడే అసలు దేశంలో ఒసిలు ఎవరు..? బిసిలెవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జన్మ ద్వారా వచ్చిన కులాన్ని మార్చడం సాధ్యం కాదు కానీ, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనకబాటు ఆధారంగా వారికి రిజర్వేషన్ కల్పించి వారి పురోభివృద్ధికి చర్యలు తీసుకోవడం అనివార్యం.

అందుకే ప్రభుత్వం కుల, మత, వర్గాలకు అతీతంగా బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలతోపాటు వారి రిజర్వేషన్ ప్రయోజనాలకూ భంగం కలగకుండా ఒసిల్లో ఉన్న పేదలకు కూడా ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కల్పించింది. రిజర్వేషన్ మినహాయించిన తర్వాత మిగిలిన ఓపెన్ కేటగిరీలో అన్ని సామాజిక వర్గాలవారు సమానంగా పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగినపుడు ఈ చట్టానికి అనుకూలంగా తీర్పు రావడం గమనార్హం. 1953లో ఏర్పాటైన కాకా కలేల్కర్ కమిషన్ దాదాపు రెండు వేలకు పైగా వెనుకబడిన కులాలను గుర్తించింది. కానీ దాని సిఫార్సులు అమలు కాలేదు. 1979లో ఏర్పాటైన మండల్ కమిషన్ దాదాపు మూడు వేల కులాలను ఒబిసిలుగా వర్గీకరించి, 27 శాతం రిజర్వేషన్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో సిఫారసు చేసింది. 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఈ సిఫారసును అమలు చేసింది. ఇది దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది.

1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు 27% రిజర్వేషన్‌ను సమర్థించి, క్రీమీలేయర్‌ను మినహాయించాలని ఆదేశించింది. తదనంతరం, ఈ రిజర్వేషన్ ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాలకు విస్తరించబడింది. రిజర్వేషన్ విధానం ఒబిసిలకు విద్య, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది. అయితే, రాజకీయ రిజర్వేషన్ల విషయంలో ఎస్‌సి, ఎస్‌టిలకు ఉన్నట్లు ఒబిసిలకు చట్టసభల్లో ప్రత్యేక కోటా లేదు. భారతీయ సమాజంలో ఎస్‌సి, ఎస్‌టిలతో పోల్చితే కొంతవరకు సామాజికంగా, ఆర్థికంగా బిసిలు పురోభివృద్ధి సాధించినందున ఎస్‌సి, ఎస్‌టి వర్గాలకు దాదాపు జనాభా శాతానికి సమానంగా రిజర్వేషన్ కల్పించినప్పటికీ, బిసి జనాభా దామాషా ప్రకారం వారికి రిజర్వేషన్ కల్పించి ఉండకపోవచ్చు. సమకాలీన సందర్భంలో కులగణన అనేది ఒక కీలక అంశంగా మారింది. ఈసారి జరగనున్న జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ గణన ఆయా సామాజిక వర్గాల జనాభా, ఆర్థిక స్థితిగతులపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంటుంది. ఆయా సామాజిక వర్గాలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ ఫలాలు అందాలంటే క్రీమీలేయర్‌ను పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడిన సామాజికవర్గాలు తరతరాలుగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం వల్ల, నిజంగా వెనుకబడిన సమూహాలకు అవకాశాలు తగ్గుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం క్రీమీ లేయర్ ఆదాయ పరిమితిని సమీక్షించడం ద్వారా రిజర్వేషన్ ఫలాల్ని అట్టడుగువర్గాలకు అందించే ప్రయత్నం చేయవచ్చు. రాష్ట్రాలకు ఒబిసి జాబితాలను నిర్వహించే అధికారం 2021లో 105వ రాజ్యాంగ సవరణ ద్వారా పునరుద్ధరించబడింది. 1931 జనగణన ఆధారంగా అంచనా వేయబడిన జనాభా శాతాలు దాదాపు వందేళ్ళ క్రితం సేకరించబడినవి. ప్రతి జనగణనలో ఎస్‌సి,ఎస్‌టిల జనాభా వివరాల్ని సేకరిస్తున్నప్పటికీ రాబోయే జనగణనతోపాటు చేసే కులగణన ఈ అంతరాన్ని పూరించి, ఖచ్చితమైన గణాంకాల్ని(డేటా)తో రిజర్వేషన్ విధానాలను మరింత సమర్థవంతం చేయగలదు.

వివిధ రాష్ట్రాలలో కుల వర్గీకరణల సంక్లిష్టత, ఓటు బ్యాంకు రాజకీయాలు, క్రీమీలేయర్ వంటి సవాళ్లు సామాజిక న్యాయ సాధనలో అడ్డంకులుగా ఉన్నాయి. వచ్చే జనగణన ఫలితాలు ఈ సవాళ్లను అధిగమించి, సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు దోహదపడాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఈ రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఒసి వర్గంలో కొన్ని కులాలు, బిసి హోదాను, బిసి వర్గంలో ఉన్న కులాలు ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గంలో చేర్చమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీద ఒత్తిడి చేస్తున్న సంఘటనలు నిత్యకృత్యం అయ్యాయి. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 ఏండ్లు అయినా అట్టడుగు ప్రజలకు ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వేషన్ ఫలాలు అందట్లేదు అంటే చట్టాలను పునఃసమీక్షించుకోవడం కన్నా ముందు క్షేత్ర స్థాయిలో వాటి అమలు తీరుపైన ప్రభుత్వాలు, పౌరసమాజం దృష్టి సారిస్తే సామాజిక న్యాయంతోపాటు సమసమాజం నిర్మితం అయ్యే అవకాశం ఉంటుంది.

  • యం. అర్జున్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News