Thursday, July 10, 2025

రేవంత్ రెడ్డి మానవీయ కోణం

- Advertisement -
- Advertisement -

తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్న వారి జీతాల్లో 10% తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశాన్ని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించిన విషయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నది. దేశంలో వృద్ధుల సంరక్షణ, సంక్షేమ పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అమ్మనాన్నలు పిల్లలతో పేగుబంధాన్ని పెనవేసుకుంటుంటే వారు పెద్దయ్యాక కనిపెంచిన వారిని కాదు పొమ్మంటున్నారు. మరికొందరైతే ఆస్తుల కోసం అమ్మానాన్నలను క్రూరంగా కడతేర్చిన కసాయి కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారిని రోడ్డున పడేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఒకరు ఖర్చులు భరించలేక, ఒకరు సేవచేయలేక దూరంపెడితే, మరొకరు పొట్టకోసం ఊరు దాటుతూ వదిలేస్తున్నారు. కొందరు కోడళ్లు అత్తమామల్ని చూడకపోవడం కారణాల వల్ల కొడుకులు నిర్లక్ష్యం చేస్తున్నారు.

చాలామంది సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధులు తమ ఆస్తినంతా పిల్లలకు ఇచ్చేశామని కానీ తమను వారు చూసుకోవడం లేదని వృద్ధాశ్రమాలకు కాసులు(Money old age homes) విదిల్చి చేతులు కడిగేసుకుంటున్నారని బాధపడుతూ ఫిర్యాదులు చేయడం లేదా, రోడ్డునపడి తమ గోడు వెళ్లబోసుకోవడం లాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం. ఒక తల్లికి అయిదుగురు కొడుకులుఉంటే అందరిని ఒకే విధంగా పెంచుతుంది.కానీ ఆ అయిదుగురు కొడుకులు ఒక్క తల్లిని పెంచాలంటే ఎంత ఈసడించుకుంటారో ప్రపంచానికి అర్థంకానీ వింత. కోట్ల రూపాయల ఆస్తులున్న కన్న కొడుకు కడుపునిండా అన్నం పెడతారన్న నమ్మకం లేదు. ప్ళ్ళైన కొన్నాళ్లకే ఆస్తులు తమ పేరున రాసుకొని తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేస్తున్నారు. అంతేకాదు వారు అసువులుబాస్తే కడచూపు చూడని కఠినాత్ములు ఎందరో.

అనాథల ఖాతాలో అంత్యక్రియలు జరుగుతున్న దౌర్భాగ్యం ఎందరిదో. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ చాలా మంది తల్లిదండ్రులను పోషించడం భారంగా చూస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉండాలని చాలా కాలంగా అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇటీవల తల్లిదండ్రులను కుమారుడు వృద్ధాశ్రమంలో చేర్పించడంతో వారు ఆవేదనకు గురై వృద్ధాశ్రమంలో భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్న ఈ సంఘటన అధికారుల సామాజిక స్పృహను తట్టిలేపింది. జీతంలో పది శాతం తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే అంశంపై పలు సందేహాలు ఉద్యోగికి ఎక్కువ జీతం ఉంటే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు గాని, తక్కువ జీతం ఉన్న వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

వారు కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు. మరి వారికి ఇది ఒక పెద్ద సమస్య అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతటివారైనా తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఆర్థ్ధికంగా లేనప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ధ చూపలేకపోవచ్చు. మరి తక్కువ జీతం ఉన్నవారు ఈ అంశాన్ని సమర్థిస్తారా? లేదా అనేది వేచిచూడాల్సిందే. అంతేకాదు అస్సలు కొడుకులు లేని వారి పరిస్థితి ఏంటి? వారి బాగోగులు ఎవరు చూడాలి? వారికి ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేస్తుందా? ఇదే కాకుండా కూతురు మాత్రమే ఉంటే వారి తల్లిదండ్రులను ఎవరు చూడాలి? అల్లుడు చూడకపోతే అల్లుడు జీతం నుండి పది శాతం కట్ చేస్తారా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొడుకులు ఉన్న తల్లిదండ్రులకు ఈ వార్త కొంత ఊరట కలిగిస్తుందేమో కానీ మిగిలిన వారి పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సి ఉంది.

కొడుకులు, బిడ్డలు లేనివారికి ఇంట్లో ఇద్దరికీ పింఛన్ ఇస్తే వారికి కొంత ఊరట కలుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. తల్లిదండ్రులను చూసుకోవాలనే నైతిక బాధ్యత ఉండాలి. అంతేతప్ప ఈ చట్టాలవల్ల సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ముమ్మాటికీ ఉండదు. ఈ అంశం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమేనా, అందరికీ వర్తిస్తుందా అనేది చాలామందికి సందేహం. ఎందుకంటే అసోం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్, చట్టం 43 ప్రవేశపెట్టింది. అస్సాం ఎంప్లాయీస్ ప్రాణ్ యాక్ట్: ప్రభుత్వం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి, తగ్గించిన సొమ్మును తల్లిదండ్రుల ఖాతాలో వేయడానికి అనుమతి ఇస్తూ 2017లో ప్రత్యేక బిల్లును తీసుకు వచ్చింది. ఈ బిల్లు ఆమోదించడంపై పలు విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులకే వర్తిస్తుందనడంలో చాలామంది అభ్యంతరం తెలియజేశారు.

తల్లిదండ్రులను పట్టించుకోని మిగిలిన వారిని ఎలా కట్టడి చేస్తారని ప్రశ్నించారు. అయినా సరే అసోం ప్రభుత్వం బిల్లు కొనసాగిస్తుంది. అంతేకాదు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తరహా చర్యలను 2021లోనే చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వర్తించకపోవడం, వృద్ధులకు ప్రభుత్వం నుంచి వృద్ధాప్య పింఛన్ కూడా రాని ఈ పరిస్థితులలో తగిన చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం సముచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు కొడుకులు ఉండి అనాథలుగా మిగులుతున్న వారికి కూడా ఈ చట్టం వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనచేయాల్సిన అవసరం ఉంది. వృద్ధుల కోసం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయం.

  • కోట దామోదర్
    93914 80475
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News