హైదరాబాద్: తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ఈగల్ టీమ్‌ను (Eagle Team) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీమ్ చాలా చురుగ్గా పని చేస్తోంది. ఇప్పటికే పలు డ్రగ్స్ రాకెట్‌లను బయటపెట్టింది. తాజాగా గంజాయి వినియోగదారులని చాలా తెలివిగా పట్టుకుంది ఈ టీమ్. గంజాయి వినియోగదారులను పట్టుకొనేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది.
ఇటీవల మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే గంజాయి సరఫరాదారును ఈగల్ టీమ్ (Eagle Team) అరెస్ట్ చేసింది. అతని ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్ ద్వారా ఈ డెకాయ్ ఆపరేషన్ చేసింది. గంజాయి వచ్చిందంటూ కస్టమర్లకు పోలీసులు మెసేజ్ పెట్టారు. ‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సాప్ కోడ్‌తో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కోడ్ పంపి గచ్చిబౌలిలోని ఓ ప్రదేశానికి రావాలని ఈగల్ టీమ్ పేర్కొంది. దీంతో రెండు గంటల్లో 14 మంది వినియోగదారులు లొకేషన్‌కి వచ్చారు. వాళ్లందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో ఐటి ఉద్యోగులు, రిలేషన్‌షిప్ మేనేజర్లు, ఆన్‌లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. ఓ వ్యక్తి గంజాయి కొనేందుకు భార్య, నాలుగేళ్ల కుమారుడితో సహా వచ్చాడు. 14 మందికి నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో డ్రగ్ పాజిటివ్ అని తేలింది. 14 మందిని డీఅడిక్షన్ సెంటర్లకు తరలించారు. నిందితుడు సందీప్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. 50 గ్రాముల చొప్పున 100 గంజాయి ప్యాకట్లు తెప్పిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఒక్కో ప్యాకెట్‌ని రూ.3 వేలకు సందీప్ విక్రయిస్తున్నాడు. సందీప్ వద్ద 100 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది.