హైదరాబాద్: పాతబస్తీ పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందని భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
గుల్జర్ హౌస్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్‌ఎఫ్, జిహెచ్‌ఎంసి, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.