నటి దీపికా పదుకొనేను మరో ప్రతిష్టాత్మక సినిమా నుంచి తప్పించారు. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ తదితర అంశాల్లో దీపికా పెట్టిన కండీషన్ల కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రం సీక్వెల్ నుంచి కూడా దీపికాను తొలగించారు. గతేడాది విడుదలైన కల్కి చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో దీపికా భాగం కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
‘‘జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. కల్కి సీక్వెల్‌లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగంలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ.. రెండో పార్ట్‌లో ఆమె భాగస్వామి కాలేకపోయింది. మరో గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మరిన్ని మంచి సినిమాలు చేసి అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతి మూవీస్ పోస్ట్ పెట్టింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌లో మైథాలజీ కలిపి తెరకెక్కిన చిత్రం కల్కి (Kalki 2898 AD). ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ శోభన, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరి సీక్వెల్‌లో దీపికా స్థానంలో ఎవరు నటిస్తారనే విషయంపై చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చే వరకూ ఎదురుచూడాలి.
Also Read : పొలిటికల్ సినిమాల్లో విభిన్నమైన చిత్రం