న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఢిల్లీ నగరంలో సివిల్ లైన్స్‌లోని తన అధికారిక నివాసంలో ‘జన్ సున్వై’ కార్యక్రమంలో సిఎం రేఖ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఓ 35 ఏళ్ల ఓ వ్యక్తి వినతిపత్రం ఇస్తూ ఆమెపై దాడి చేశాడు. సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె చెంప మీద కొట్టినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సిఎం గుప్తాపై జరిగిన దాడి ఘటనను ఢిల్లీ బిజెపి చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తీవ్రంగా ఖండించారు. అలాగే, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ కూడా ఈ దాడిని ఖండిస్తూ.. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో ముఖ్యమంత్రే సురక్షితంగా లేకుంటే.. సామాన్యుడు ఎలా సురక్షితంగా ఉంటాడని దేవేందర్ యాదవ్ ప్రశ్నించారు.