న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందేందుకు మూడేళ్లు ముందుగానే ఓటర్ల జాబితాలో తన పేరు చేర్చుకున్నారని ఆరోపిస్తూ, ఆమె చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. అదనపు ప్రధాన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఫిర్యాదుదారు వికార్ త్రిపాఠి తరఫున సెప్టెంబర్ 10న హాజరైన సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ వాదిస్తూ 1980 జనవరిలో సోనియా గాంధీ భారత పౌరురాలు కాకుండానే ఆమె పేరును న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటరుగా నమోదుచేసుకున్నారని తెలిపారు.
భారత పౌరురాలు అనిపించుకునేందుకు ముందు ఆమె దేశ నివాసి అయి ఉండాలి. అందుకు రేషన్ కార్డు, పాస్‌పోర్టు ఉండాలి అని వాదించారు. తప్పును గుర్తించిన ఎన్నికల సంఘం ఆమె పేరును తర్వాత ఎన్నికల జాబితాను తొలగించింది. ఢిల్లీ నియోజకవర్గంలో సోనియాగాంధీని ఓటరుగా 1980లో చేర్చి, 1982లో తొలగించి, మళ్లీ 1983లో తిరిగి చేర్చారని నారంగ్ తెలిపారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 175(4) సెక్షన్ కింద ఆయన ఈ పిటిషన్ దాఖలు చేశారు. సోనియా గాంధీ 1983లో భారతీయ పౌరురాలయినప్పుడు 1980లో ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఎలా చేర్చారో పోలీసులు దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. ఏదో ఫోర్జరీ, మోసం జరిగి ఉంటుందని తెలిపారు.