బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సుకేశ్ చంద్రశేఖర్ కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్ ను గురువారం హైకోర్టు తిరస్కరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్, ఢిల్లీలో కొనసాగుతున్న ట్రయల్ కోర్టు కార్యకలాపాలను కూడా సవాలు చేస్తూ నటి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ అనిష్ దయాల్ తోసిపుచ్చారు. ప్రత్యేక కోర్టు ఇప్పటికే ఛార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకుందని, ఆమెపై ప్రాథమిక కేసు కూడా ఉందని కోర్టు పేర్కొంది. ట్రయల్ కోర్టు జారీ చేసిన కాగ్నిజెన్స్ ఆర్డర్ ను జాక్వెలిన్ సవాలు చేయలేదని ED తరపు న్యాయవాది ఈ పిటిషన్ ను వ్యతిరేకించారు.
కాగా, సుకేశ్ చంద్రశేఖర్ తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ని నిందితురాలిగా ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆమె పలుసార్లు విచారణ కోసం ఈడీ ముందు హాజరయ్యారు.