రాష్ట్రంలో నిరంతర విద్యుత్ వెలుగులకు నాటి కాంగ్రెస్ ముందుచూపే కారణం
డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా
అన్ని జలవిద్యుత్ యూనిట్లను వినియోగంలోకి తేవాలి
ఎపి ప్రాజెక్టులకు సహకరించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం
గత సర్కార్ తప్పిదాలకు మూల్యం చెల్లిస్తున్నాం
సాగర్ పర్యటనలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క
మనతెలంగాణ/హాలియా: విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణ దిక్సూచి అని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. నేడు తెలంగాణలో నిరంతర విద్యుత్ వెలుగులకు.. నాటి కాంగ్రెస్ ముందు చూపే కారణమన్నారు. కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయా లు రాష్ట్రానికి భారంగా మారాయని ఆరోపించారు. గత పాలకులు చేసిన తప్పిదాలకు నే డు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని అన్నారు. శ్రీశైలంపై ఎపి ప్రభుత్వం ప్రాజెక్ట్ లు కడుతుంటే అడ్డుకోకుండా గత ప్రభు త్వం సహకరించిందని మండిపడ్డారు. ఆనా డు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామని గుర్తుచేశారు.
ఆనాడు కెసిఆర్, హరీశ్‌రావు, కెటిఆర్ తప్పులు చేసి వాటిని ఇప్పుడు తమ పై రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అ న్నారు.ప్రజలకు అంతరాయం లేకుండా క రెంట్ అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతేడాది మార్చి 24న 308.45 మిలియన్ యూనిట్ల కరెంట్ సరఫరా చేయగా..ఈ ఏడాది 18 మార్చిన 335 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికమని భట్టి చెప్పారు. గత ఏడాది మార్చి 8 న 15,497 మెగావాట్ల హైడిమాండ్ ఏర్పడ గా.. ఈ ఏడాది మార్చి 20న 17,162 మెగావాట్ల డిమాండ్ ఏర్పడిందని చెప్పారు. సుమారు 2000 మెగావాట్ల అదనపు డిమాం డ్ ఉన్నప్పటికీ సెకన్ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్‌లో రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ముందుగా అధికారులు అన్ని అధికారులు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. ఆయా పవర్ ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత పరిస్థితిని వివరించా రు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తూ… అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌లలోని అన్ని యూనిట్లు వినియోగంలో తీసుకురావాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయం ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు. పవర్ ప్రాజెక్టు యూనిట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండవద్దని , అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారుచేయాలని అన్నారు. ఇందుకొక క్యాలెండర్‌ను రూపొందించాలని, ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతి వారం సమీక్షించాలని, ముందు నుండే సమీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఈ సందర్భంగా జెన్కో సిఎండి డాక్టర్ హరీశ్ ఆయా ప్రాజెక్టులపై వివరాలను తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎంఎల్‌సి శంకర్ నాయక్ అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.