Sunday, May 4, 2025

రెండేళ్లలో దేవాదుల పూర్తి

- Advertisement -
- Advertisement -

దేవాదుల పంపుహౌస్ స్టేషన్‌ను సందర్శించిన అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మన తెలంగాణ/హన్మకొండ: దేవాదుల ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మం డలం, దేవన్నపేట శివారులోని దేవాదుల పంపు హౌస్ స్టేషన్‌ను రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, పాలకుర్తి, జనగామ ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, కే ఆర్ నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు.

హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి నేరుగా మంత్రులు దేవన్నపేటలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద మంత్రులు దిగగా ఎమ్మెల్యేలు, కలెక్టర్, తదితరులు పుష్పగుచ్చాలను అందజేశారు. దేవాదుల పంపుహౌస్ స్టేషన్‌కు చేరుకున్న మంత్రులు టన్నెల్‌ను పరిశీలించారు. అనంతరం దేవాదుల పంపు హౌస్ పనుల పురోగతి, ఇతర అంశాలపై సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మం త్రులు మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్ట్ అన్ని దశలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే దేవాదుల పంప్ హౌస్‌ను సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సాగునీరు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదుల మూడు పైపులైన్ల పంపులను ఆన్ చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేవాదుల పంప్ హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి పారుదల శాఖ ఈఎన్‌సి అనిల్ కుమార్, సిఒ అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News