న్యూఢిల్లీ: దేవాలయాలకు భక్తులు సమర్పించే డబ్బులు కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఆలయ నిధులను ప్రభుత్వ విధులుగా పరిగణించలేమంటూ మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది. తమిళనాడు లోని ఐదు దేవాలయాలకు చెందిన నిధులతో రాష్ట్రం లోని వివిధ ఆలయాల ప్రాంగణాల్లో కల్యాణ మండపాల నిర్మాణానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పిటిషనర్లు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. దీన్ని సవాలు చేస్తూ తమిళనాడు సర్కారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కల్యాణ మండపాల కోసం భక్తులు తమ డబ్బును ఆలయాలకు ఇవ్వరు. ఆలయ అభివృద్ధి వంటి వాటికోసం ఇస్తుంటారు. ఒక ఆలయ ప్రాంగణంలో పెళ్లి జరుగుతుంటే అక్కడ అసభ్యకరమైన పాటలు ప్లే చేస్తుంటే, అది సరైనదేనా ? అని ప్రశ్నించింది. ఆ డబ్బును విద్య, వైద్యం వంటి దాతృత్వ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని సూచించింది. తదుపరి విచారణను నవంబర్ 19 కి వాయిదా వేసింది.