Monday, May 12, 2025

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం

- Advertisement -
- Advertisement -

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఆదివారం భక్తజనంతో పోటెత్తింది. వేసవి సెలవులు, స్వాతి నక్షత్రం కావడంతో స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో యాదగిరి కొండపై ఎటుచూసినా భక్తులే కనిపించారు. స్వామివారి దర్శనం క్యాలైన్లు, ప్రసాద విక్రయ కేంద్రాలు, గదుల విచారణ కార్యాలయాలు, కొండపైకి వెళ్లే దారుల్లో భక్తులు సందడి చేశారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతం, అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు. అనంతరం ఆలయంలో జరిగిన శ్రీసుదర్శన నారసింహ హోమం,

నిత్యకల్యాణం, నిత్యబ్రహ్మోత్సవం, వెండి జోడి సేవ, స్వర్ణపుష్పార్చన పూజలలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్ల శీఘ్రదర్శనం 5 గంటలు, అతిశీఘ్రదర్శనం 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి కొండపైన దర్శన క్యూలైన్లతో పాటు ప్రసాద విక్రయ కేంద్రం, శివాలయం, పలు కూడళ్లలో భక్తుల సందడి నెలకొంది. యాదగిరిగుట్ట కొండపైన కొలువైన శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకొని తరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News