న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ నయా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో బ్రెవిస్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. మంగళవారం డార్విన్‌లోని మర్రారా క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్ లో డెవాల్డ్ బ్రెవిస్ కేవలం 41 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి పలు రికార్డులు నెలకొల్పాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. గతంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్టిల్(ఆస్ట్రేలియాపై 49 బంతుల్లోనే సెంచరీ) పేరిట ఉన్న రికార్డును బ్రెవిస్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టీ20ల్లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా కూడా బ్రెవిస్ నిలిచాడు. దీంతోపాటు 2023లో వెస్టిండీస్‌పై 43 బంతుల్లో సెంచరీ చేసిన క్వింటన్ డి కాక్‌ను రికార్డును కూడా బ్రెవిస్ బ్రేక్ చేశాడు.
అలాగే, దక్షిణాఫ్రికా తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ప్లేయర్ గా బ్రెవిస్ నిలిచాడు. మొదటి స్థానంలో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అతను 2017లో బంగ్లాదేశ్‌తో జరిగిన T20Iలో 35 బంతుల్లో సెంచరీ చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన దక్షిణాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్ నిలిచాడు. 22 ఏళ్ల 105 రోజుల్లో బ్రెవిస్ ఈ ఘనత సాధించాడు. అంతకుముందు 2012లో కివీస్‌పై 24 ఏళ్లు, 36 ఏళ్ల వయసులో రిచర్డ్ లెవి సెంచరీ సాధించాడు.