పది సంవత్సరాల టిఆర్‌ఎస్ (బిఆర్‌ఎస్) పాలనలో కల్వకుంట్ల కుటుంబంతోపాటు వాళ్ళఅనుచరులు ‘ధరణి’ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు పదే పదే బహిరంగ సమావేశాల్లో, ప్రెస్ మీట్లలో అనేక రకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తామేదో గొప్పగా ధరణిలోని లోపాలను సవరించుకుంటూ ధరణి కంటే అద్భుతమైన పోర్టల్‌ను తీసుకువస్తామని చెప్పి అదే పోర్టల్‌ను పేరు మార్చి ‘భూభారతి’ పేర ప్రవేశపెట్టారని క్షేత్రస్థాయిలో ప్రజలతోపాటు రెవెన్యూ అధికారులు సైతం మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ లో అనేక లోపాలున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతిని ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు కూడా నిబంధనలను ఖరారు చేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన భూభారతికి, తెరాస ప్రభుత్వంలో ఉన్న ధరణికి కొన్నికొన్ని అంశాల్లో అసలు తేడానే లేదని ధరణిలో ఏవిధంగానైతే లోపాలు ఉన్నాయో అదే విధంగా భూభారతి లో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని స్వయంగా రెవెన్యూ అధికారులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. 2014కు ముందు తహసీల్దార్ కార్యాలయాల్లో నాలా కన్వర్షన్‌లు చేయాలన్న, భూమికి పట్టా పాస్‌బుక్‌లు (Land title passbooks) జారీ చేయాలన్నా కఠిన నిబంధనలు ఉండేవి. కానీ ధరణి వచ్చిన తర్వాత పైన పేర్కొన్న వాటికి అసలు నిబంధనలే లేకపోవడంతో రెవెన్యూ అధికారులకు అవినీతి చేసే అవకాశం అప్పటి ప్రభుత్వమే ఇచ్చినట్టయింది. ధరణిలో ఉన్న చిన్నచిన్న లోపాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది తహసీల్దార్‌లు అనేక అక్రమాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తినట్లు వివిధ పత్రికలల్లో, ఛానల్‌లలో కనపడేవి.
ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ అని అధికారంలోకి రాగానే ధరణిని మారుస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే ధరణి ప్లేస్‌లో భూభారతిని తీసుకువచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి లోనైనా పరిస్థితి మారిందా అంటే అదీ కనిపించడం లేదు. ఉదాహరణకు ధరణిలో ఏవిధంగానైతే అనుమతి లేని వెంచర్‌లలో నాలా కన్వర్షన్‌లు, పట్టా పాస్ బుక్‌ల చేయడానికి ఖచ్చితమైన నిబంధనలు లేవో, భూభారతిలో కూడా లేవని తహసీల్దార్‌లే బహిరంగంగానే మాట్లాడుకోవడం గమనించాల్సిన అంశం. నాలా కన్వర్షన్‌లు, పట్టా పాస్‌బుక్ ల జారీలో ధరణిలో ఏవిధంగానైతే అక్రమాలు జరిగాయో, అదే విధంగా భూభారతిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వెంచర్‌లు పుట్టగొడుగుల్లా వెలువడానికి ప్రధాన కారణం అప్పుడు ‘ధరణి’ అయితే ఇప్పుడు ‘భూభారతి’ అని చెప్పక తప్పదు.
రాష్ట్రంలో ఉన్న కొంతమంది రియల్టర్ డబ్బు సంపాదించడంకోసం ఎక్కడ పడితే అక్కడ ఎకరం, రెండెకరాలు అగ్గువ సగ్గువకు కొనుగోలు చేసి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామ పంచాయతీల్లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వెంచర్‌లు చేసి సామాన్య ప్రజలకు అందులోని ప్లాట్లను అంటగడుతున్నారంటే ఆనాటి ధరణి నేటి భూభారతి లో ఉన్న లోపాల వల్లే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాన్ లేఅవుట్ వెంచర్‌లలోని ప్లాట్లను కొన్న సామాన్యులు గృహ నిర్మాణానికి అనుమతులు రాక, అటు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు తెచ్చిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్న పరిస్థితి అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అప్పుడు ధరణి అయితే ఇప్పుడు భూభారతి అని చెప్పొచ్చు.
ఎందుకంటే అప్పటి ధరణిలో కానీ, ఇప్పటి భూభారతిలో కానీ నాలా కన్వర్షన్‌లకు, పట్టా పాస్ బుక్‌లు జారీ చేయడానికి కానీ ఎటువంటి స్పష్టమైన నిబంధనలు పొందుపరచలేదు. భూభారతి, ధరణి కంటే ముందు తహసీల్దార్‌లు నాలా కన్వర్షన్ చేయాలంటే కనీసం 10 గుంటల భూమిని అయితేనే కన్వర్షన్ చేసేవారు. అలాగే పట్టా పాస్ బుక్ జారీచేయాలన్నా కనీసం 10 గుంటల భూమిని కొనుగోలు చేస్తేనే పాస్ బుక్‌లు జారీ అయ్యేవి. కానీ ధరణితోపాటు భూభారతి లో 100 గజాలకు, 120, 150, 170 మొదలగు గజాలకు నాలా కన్వర్షన్‌లు చేసే ఆప్షన్ ఉంది. దాంతో రియల్టర్‌లకు అనుమతి లేని వెంచర్‌లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపించుకోవడం సులువుగా అయితుండడంతో వారు మరిన్ని నాన్ లేఅవుట్ వెంచర్‌లు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అదే ధరణిలో కానీ భూభారతిలో కానీ నాలా కన్వర్షన్ చేయడానికి నిబంధనలు కనుక ఉంటే రియల్టర్ నాన్ లేఅవుట్‌లు చేయడానికి భయపడతారు. అదే కాకుండా సామాన్యులు కూడా అనుమతి లేని వెంచర్‌లలోని ప్లాట్లను కొనుగోలు చేయరు.
ధరణి, భూభారతిలోని మరో లోపం ఏమిటంటే ఉదాహరణకు ఓ రియల్టర్ అనుమతి లేకుండా ఎకరం భూమిలో 15 నుండి 20 ప్లాట్లు చేస్తే ఆ వెంచర్‌కు అనుమతి లేదు కాబట్టి అందులోని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్‌లు రిజిస్ట్రేషన్ చేయడంలేదు. అదే తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక గుంట, రెండు గుంటలకు పాస్ బుక్‌లు ఇస్తుండడంతో రియల్టర్‌కు ప్రోత్సాహం లభించినట్లవుతున్నది. దాంతో వారు అర ఎకరంలో కూడా వెంచర్‌లు చేసి సామాన్యులకు అంటగడుతున్నారు. అదే ధరణిలో కానీ, భూభారతిలో కానీ ఎన్ని గుంటలకు పాస్‌బుక్ జారీ చేయాలో స్పష్టమైన నిబంధన ఉంటే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని నా అభిప్రాయం. పైన చెప్పిన విధంగా నిబంధనలు లేకపోవడంతో అటు రియల్టర్‌లు, ఇటు తహసీల్దార్‌కు పైసల పంట పండుతుంటే సామాన్యులకు మాత్రం ఇల్లు నిర్మించుకోలేక పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
తహసీల్దార్‌లు నాలా కన్వర్షన్, పట్టా పాస్ బుక్‌లు చేయాలంటే గతంలో లాగా కనీసం 10 గుంటలు ఉండాలనే అనే నిబంధన కనుక రెవెన్యూ శాఖ తీసుకువస్తే అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. విచ్చలవిడి కన్వర్షన్‌లు, గుంట రెండు గుంటలకు పాస్ బుక్‌ల అంశంపై కొంతమంది తహసీల్దార్‌లను మీడియా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ప్రశ్నిస్తే ప్రభుత్వమే అలాంటి కఠిన నిబంధనలు తీసుకువస్తే మేము కూడా చేయము కదా అని స్పష్టంగా చెప్తున్నారు. ధరణి కంటే బ్రహ్మాండమైన పోర్టల్‌ను తీసుకొచ్చామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ధరణినే పేరు మార్చి భూభారతిగా తీసుకొచ్చారని క్షేత్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతిలో పైన పేర్కొన్న సవరణలు చేస్తే ఇటు ప్రభుత్వ ఆదాయం పెరగడానికి, అటు నాన్ లేఅవుట్ వెంచర్‌లకు అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది.
- నమిండ్ల ప్రమోద్
63056 38569