కర్ణాటకలోని పుణ్యక్షేత్రమైన ధర్మస్థళ లో జరుగుతున్న సామూహిక ఖనన దర్యాప్తులో కీలక పురోగతి సాధ్యమైంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దర్యాప్తులో భాగంగా సైట్ నెంబర్ 6 వద్ద జరిపిన తవ్వకాలలో అస్థిపంజరం అవశేషాలను కొనుగొన్నారు. ఆ అస్థి పంజర అవశేషాలు చాలా వరకూ పురుషుడివి అయి ఉండవచ్చునని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఆధారాలు లభించిన మొదటి ప్రదేశం ఇదే. జూలై 3న ధర్మస్థళ పోలీసు స్టేషన్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో దేశం ఉలిక్కిపడింది.1998 -2014 మధ్య ధర్మస్థళ పట్టణంలో మహిళలు, మైనర్ల మృతదేహాలను బలవంతంగా ఖననం చేశారని, వారిలో చాలా మంది లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని మాజీ పారిశుథ్య కార్మికుడైన ఆ వ్యక్తి పోలీసులకు తెలుపడంతో ప్రభుత్వ యంత్రాంగం సిట్ ను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేపట్టింది. బృందం ఆధ్వర్యంలో ఖననం చేశారని భావిస్తున్న ప్రదేశాలలో తవ్వకాలు చేపట్టారు. మొత్తం మీద ఆరో నెంబర్ సైట్
వద్ద తవ్వకాలలో అస్థిపంజరం అవశేషాలు బయటపడ్డాయి.
సంఘటనా స్థలంలో ఉన్న ఫోరెన్సిక్ బృందం తదుపరి పరీక్ష కేసం అవశేషాలను భద్రపరచింది. మరిన్ని వివరాలను సేకరించేందుకు డాగ్ స్క్వాడ్ ను రప్పించారు. చాలా కాలం అయినందువల్ల పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చెల్లాచెదురయ్యే అవకాశం ఉండడంతో తవ్వకం కార్యకలాపాలలో మరికొంత జాప్యం జరగవచ్చు.ఆ ప్రదేశంలో రెండు మృతదేహాలను ఖననం చేశానని ఆ పారిశుధ్య కార్మికుడు పేర్కొన్నాడు. ఆస్థి పంజర అవశేషాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని, ఆధారాల సేకరణ ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో గుర్తించిన ఐదు ప్రదేశాలలో మానవ అవశేషాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ లభించలేదు. నేత్రావతి నది వెంబడి ఉన్న ప్రదేశాలలో మొదటి దానిని పారిశుధ్యకార్మికుడి సమక్షంలో తవ్వకాలు జరిగాయి. నీటి ఉప్పెన ఎదురుకావడంతో అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు, రెవిన్యూ సిబ్బంది జేసీబీ యంత్రాంగాన్ని ఉపయోగించి లోతుగా తవ్వినా, ఆ ప్రదేశంలో ఎటువంటి అవశేషాలు లభించలేదు.
ఈ కేసులో మొదట పోలీసు ఫిర్యాదు చేసిన పారిశుధ్య కార్మికుడు సామూహిక ఖననాలు,
దహన సంస్కారాలు జరిగాయని చెప్పిన, 15 అనుమానిత ప్రదేశాలను గుర్తించిన తర్వాత ఈ తవ్వకాలు మొదలు పెట్టారు. వాటిలో 8 ప్రదేశాలు నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. మరోమూడు ప్రదేశాలు నది సమీపంలోని హైవే పక్కన ఉన్నాయి. మరో ప్రదేశం నేత్రావతి, అజుకురిని కలిపే రహదారిపై ఉంది. రెండు హైవే సమీపంలో కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి. ఆరో సైట్ లో బయటపడిన అస్థిపంజరం అవశేషాలతో ఆ వ్యక్తి చేసిన ఆరోపణల్లో నిజానిజాలు ఎంతో బయట పడవచ్చు.