గ్రంథాలయాల్లో పోలీసులతో లాఠీ చార్జీ జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని ధ్వజమెత్తారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చిన ప్రభుత్వం నేడు లైబ్రరీల్లో విద్యార్థులపై ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లైబ్రరీలలో నిషేధాజ్ఞలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయడం పట్ల బుధవారం హరీష్ రావు ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్ని వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. గ్రంథాలయాలను రాజకీయ వేదికలుగా మార్చిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు.
ఇప్పుడు సుద్దపూస మాటలు, నీతులతో బోర్డులు పెట్టినంత మాత్రాన పాపపరిహారం కాదని అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రాజకీయం అంతా లైబ్రరీల చుట్టే జరిగిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని సైతం లైబ్రరీకి తీసుకువచ్చి బూటకపు హామీలు ఇచ్చిన సంగతి మరిచిపోయారా?, అధికారంలోకి రాగానే అవి రాజకీయ వేదికలు కావు, గ్రంథాలయాలు అని గుర్తుకు వచ్చాయా? అని హరీశ్‌రావు నిలదీశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని మీ నాయకుడిని విద్యార్థులు నిలదీసినందుకు, ఈరోజు గ్రంథాలయాల్లో నిషేధాజ్ఞలు ఏర్పాటు చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ నేతలను ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేశారని ఆరోపించారు. 20 నెలల్లో 12వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావని రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.
నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డిపై విమర్శల దాడి చేశారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
డయేరియాతో ఊరు ఊరంతా మంచం పట్టిన దారుణ పరిస్థితి
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని ఒక ప్రకటనలో తెలిపారు. శుభ్రమైన తాగు నీరు సరఫరా చేయడంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ శాఖ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ శాఖ కూడా ఘోర వైఫల్యం చెందిందని అన్నారు. మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బిఆర్‌ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.