Tuesday, July 8, 2025

అక్బరుద్దీన్‌కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా?.. సర్కార్ పై బిజెపి చీఫ్ ఫైర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః పాతనగరంలోని సల్కం చెరువు భూమిలో మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ అక్రమంగా నిర్మించిన కళాశాల భవనానికి హైడ్రా మినహాయింపు ఇచ్చిందా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఒక న్యాయం పేదలకు మరో న్యాయమా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కళాశాల నిర్మించిన విషయం వాస్తవమేనని, అయితే అందులో పది వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమని ప్రభుత్వం చెప్పడం విస్మయం కలిగిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిథిలో వేలాది మంది పేదలు, చెరువు శిఖం భూములను పేద, మధ్య తరగతి ప్రజలు సంపాదించిందంతా పోసి ఖరీదు చేస్తే, వారి ఇండ్లను ఎందుకు కూల్చి వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌కు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ మార్క్ పాలన అని ఆయన ప్రశ్నించారు. చెరువు భూమిలో భవనాన్ని నిర్మించినందున వేరే భవనానికి కళాశాలను మార్చుకోవాలని సూచన ఎందుకు చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల విషయంలో దూకుడుగా వ్యవహారిస్తున్న హైడ్రా అధికారులు అక్బరుద్దీన్ అక్రమ భవనాన్ని కూల్చేందుకు రంగంలోకి ఎందుకు దిగడం లేదని ఆయన నిలదీశారు.

అందరికీ ఒకే న్యాయం అందిస్తే అక్బరుద్దీన్‌కు చెందిన కళాశాల భవనాన్ని ఎందుకు కూల్చడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, అనుచరులు దాదాగిరి చేసినా, చివరకు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోయినా, తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే తామే రంగంలోకి దిగి కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు. మీడియా సంస్థలపై బిఆర్‌ఎస్ దాడలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే దాడులు నిలిపి వేయాలని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News