Saturday, July 12, 2025

బీదలు ఓ వైపు… బిలియనీర్లు మరోవైపు

- Advertisement -
- Advertisement -

దేశ సంపద వికేంద్రీకరణ జరగకుండా కేంద్రీకృతం కావటంతో పేదల, ధనికుల వ్యత్యాసం తీవ్రంగా పెరుగుతూ ఉంది. కొద్ది మంది కోటీశ్వరుల వద్ద సంపద, కొద్ది మంది భూకామందుల వద్ద సాగు భూములు ఉండటంతో, సంపదలు సృష్టించే అత్యధిక మంది గ్రామీణ పేదలు, కార్మికులు , శ్రామికులు సంపదకు దూరంగా ఉన్నారు. పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాలే అందుకు కారణంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పేదల సంఖ్య విషయంపై వేర్వేరుగా అనేక నివేదికలు, అంచనాలు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 80 కోట్ల, 80 లక్షల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 101 కోట్ల మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. ఈ 101 కోట్ల పేదల్లో సగం మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కాగా, 13.5 శాతం మంది పిల్లలు 18 ఏళ్ల పైబడిన వారు ఉన్నారు. సగం మంది పేదలు పోషకాహార లోపంతో జీవిస్తున్నారు.

83.7% మంది పేదలు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారని ఐక్య రాజ్య సమితి నివేదిక పేర్కొంది. మొత్తం గ్రామీణ జనాభాలో 28% మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. అనేక దేశాల్లో పేదలు ఎక్కువగానే ఉన్నారు. ఇండోనేషియాలో 4 కోట్ల, 70 లక్షల పేదరికంలో ఉన్నారు. ఆ దేశ జనాభాలో ఇది 18% కాగా, అత్యధిక పేదలు ఉన్న దేశాల్లో 5వ స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో 5 కోట్ల, 90 మంది ప్రజలు పేదరికంలో ఉండి, ఆ దేశ జనాభాలో 29% గా ఉన్నారు. అధిక పేదలు ఉన్న దేశాల్లో 4వ స్థానంలో ఉంది. ఆఫ్రికా దేశం నైజీరియాలో 8 కోట్ల, 60 లక్షల మందితో, పేదరికపరంగా 3వ స్థానంలో ఉంది. పేదలు, పేదరికంలో ఉన్న దేశాలు సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియాలో ఉన్నాయి.

చైనాలో పేదరికం నేడు తక్కువగా ఉంది. 2020లో 5 కోట్ల, 60 లక్షల మంది ఆ దేశ పేదరిక రేటుకు దిగువన ఉన్నారు. దేశ జనాభాలో 1.7 శాతంగా ఉంది. 2025 లో ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం పేదరికం 0.7%గా ఉంది. ప్రస్తుతం పేదల సంఖ్య ఎంత అనేది అందుబాటులో లేదు. చైనాలో కూడా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ వ్యత్యాసాలు ఉన్నాయి. అమెరికాలో కూడా 2022 సంవత్సరంలో 12.4% పేదల లెక్క బయటపడింది. ఇంకా ఇతర పెట్టుబడిదారీ దేశాల్లోనూ పేదలు గణనీయంగానే ఉన్నారు. భారతదేశంలో 201112 సంవత్సరంలో పేదరికం 27.1% (34.4 కోట్లు)గా ఉంటే, 2022- 23 నాటికి 5.3% (7.5 కోట్లకు) తగ్గిందని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. పేదరికం శాతం తగ్గినా, దేశ ప్రజల్లో 22% మంది పేదరికంలో జీవిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం దేశంలో 35 కోట్ల మంది కనీస అవసరాలు తీర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

మోడీ ప్రభుత్వం చెప్పినట్లుగా పేదరికం తగ్గితే 80 కోట్ల మందికి రేషన్ బియ్యం సప్లయ్ చేయటం ఎందుకు?
భారతదేశంలో పేదరిక అంచనాపై అనేక మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశంలో దారిద్య్రరేఖను అంచనా వేయటం, పేదరిక గురించి అనేక కమిటీలు చేసిన నిర్ధారణలు కూడా హాస్యాస్పదంగాను, పేదరికాన్ని అపహాస్యం చేసేవిగా ఉన్నాయి. అమెరికాలో నలుగురు కుటుంబానికి రోజుకి 63 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉంటే పేదలుగా పరిగణిస్తారు. భారతదేశంలో అర డాలర్ కన్నా ఎక్కువ సంపాదించే వారిని పేదలుగా గుర్తించటంలేదు. ప్రపంచ బ్యాంక్ మాత్రం భారత్‌లో 2.3 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వారిని పేదలుగా గుర్తించింది. భారతదేశంలో క్షేత్రస్థాయిలో పేదరికాన్ని అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్, ఐక్య రాజ్య సమితి చెప్పిన లెక్కలన్నీ తలకిందులు అవుతాయి.

ప్రపంచ దేశాల్లో పేదరికం పెరుగుతూ ఉంటే, మరో వైపు బిలియనీర్లు పెరుగుతూ వస్తున్నారు. 2025 నాటికి ప్రపంచ బిలియనీర్ల సంఖ్య 3,030 చేరుకుంది. వారి మొత్తం సంపద 12 లక్షల కోట్ల అమెరికా డాలర్లుగా అంచనాగా ఉంది. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎలెన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని నికర ఆస్తి 377 బిలియన్ (30 లక్షల, 60 వేల కోట్ల రూపాయలు) డాలర్లు. అతని తర్వాత మార్క్ జుకర్ బర్గ్ ఆస్తి 235 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 227 బిలియన్ డాలర్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. వీరు గాక లారీ ఎల్లిసన్ 194 బిలియన్ డాలర్లు, బిల్ గేట్స్ 176 బిలియన్ డాలర్లు, స్టీవ్ బాల్మెర్ 160 బిలియన్ డాలర్లతో ఉన్నారు. భారతదేశంలో 2024లో 191 మంది బిలియనీర్లు ఉంటే, 2025లో వీరి సంఖ్య 284కు చేరింది. బిలియనీర్లలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. 2015 నుండి భారతదేశంలో బిలియనీర్ల అదనంగా 123 మంది పెరిగారు.

ముఖేష్ అంబానీ 8 లక్లల, 60 వేల (8.6 ట్రిలియన్ రూపాయలు. ఒక ట్రిలియన్ లక్ష కోట్లు) కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉంటే, ఆ తర్వాత గౌతమ్ అదానీ 8 లక్షల, 40 (8.4 ట్రిలియన్లు రూపాయలు) వేల కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోష్నినాడర్ ( హెచ్‌సిఎల్ టెక్నాలజీ) 3.5 లక్షల కోట్లు, దిలీప్ షాంఘ్వీ (సన్ ఫార్మా) 2.5 లక్షల కోట్లు, అజీమ్ ప్రేమ్ జీ ( విప్రో) 2.2 లక్షల కోట్లు, కుమార్ మంగళం బిర్లా (ఆదిత్య బిర్లా గ్రూప్) రెండు లక్షల కోట్లు, సైరస్ పూని వల్లా (సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) 2 లక్షల కోట్ల రూపాయలు, సిరాజ్ (బజాజ్ ఆటో) 1.6 లక్షల కోట్లు, రాధా కిషన్ దమానీ (అవెన్యూ సూపర్ మార్ట్) 4.4 లక్షల కోట్ల రూపాయల సంపద కలిగి ఉన్నారు.

భారత బిలియనీర్ల సగటు వార్షిక సంపద 34,514 కోట్లు. దేశంలో వెయ్యి కోట్లు సంపద కలిగి ఉన్న వారి సంఖ్య 1,539 మంది ఉంటే, అందులో 5 వేల కోట్ల సంపద కలిగిన వారు 534 మంది ఉన్నారు. నల్లధనాన్ని పరిగణనలోకి తీసుకుంటే వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలోని 1% సంపన్నులు దేశసంపదలో 58% కలిగి ఉంటే, దేశంలోని 67 కోట్ల పేదల వద్ద ఒక శాతం సంపద మాత్రమే ఉంది. 13.8% ఉన్న ధనిక రైతుల వద్ద సాగుభూమి 46% ఉంటే, 84%గా ఉన్న చిన్న, సన్నకారు రైతుల వద్ద 47.3% భూమి ఉంది. దేశంలో కేవలం 4.9% భూకామందుల వద్ద 32% భూమి ఉంది.

దేశంలోని ఒక పెద్ద భూ కామందు ఒక్క సన్నకారు రైతు కన్నా 45 రెట్లు భూమి కలిగి ఉన్నాడు. ప్రపంచంలో, భారతదేశంలో బడా పారిశ్రామిక వేత్తల, సంపన్నుల, భూ కామందుల వద్ద దేశాల సంపద, సాగు భూములు కేంద్రీకృతమై ఉంది. దాని ఫలితమే అనేక దేశాల్లో అత్యధిక ప్రజలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ ఉపాధి, ఉద్యోగ కల్పన , శ్రమకు తగ్గ వేతనం లభించినప్పుడే పేదరికం తొలుగుతుంది. అందుకు సమగ్ర భూసంస్కరణలతో పేదలకు భూపంపిణీ జరగాలి. పరిశ్రమల్లో కార్మికులకు భాగస్వామ్యం ఉండాలి. బడా కోటీశ్వరుల సంపద ప్రజల పరం కావాలి. ఇవి సాధించుకోవటానికి భారతదేశ గ్రామీణ పేదలు, కార్మికులు, నిరుద్యోగులు, యువజనులు దోపిడీ వర్గాల పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలి. మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఆ విధంగానే ఉద్యమించాలి.

  • బొల్లిముంత సాంబశివరావు
    98859 83526
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News