ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కి ముందు టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్ట్‌లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు లేకుండానే ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత్.. సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శనే చేసినప్పటికీ.. విరాట్, రోహిత్‌లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా విరాట్ సడెన్ రిటైర్‌మెంట్ ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ ఇంకొంత కాలం ఆడితే బాగుండేదని చాలా మంది ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.
తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్‌సర్కార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్ విషయంలో కాస్త తొందరపడ్డాడని పేర్కొన్నారు. కనీసం ఇంగ్లండ్ టూర్ జరిగిన తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుండేది అని అన్నారు. ‘‘నేనే బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అయితే.. కోహ్లీని ఇంగ్లండ్ టూర్ తర్వాత రిటైర్‌మెంట్ ప్రకటించమని ఒత్తిడి తెచ్చేవాడిని. ఎందుకంటే అతని క్లాస్, అనుభవం ఆ సిరీస్‌లో టీంకు ఎంతో అవసరం’’ అని వెంగ్‌సర్కార్ తెలిపారు. కాగా, గత ఏడాది టి-20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.