ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపిలు నిరసన తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన చేపట్టాయి. బీహార్‌లో ఓటర్ల సవరణ జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణ చేశాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ చేపట్టాలని ఇండియా కూటమి పార్టీల ఎంపిలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల సవరణతో 60 లక్షల మంది ఓటర్లను తొలగించారని సమాజవాదీ పార్టీ ఎంపి డింపుల్ యాదవ్ ఆరోపణలు చేశారు. బిహార్ ప్రభుత్వం స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షితమైన ఎన్నికలను కోరుకోవడం లేదని మండిపడ్డారు. ఓటర్ల సవరణ ఎవరి గురించో అర్థం కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను ఆమె ప్రశ్నించారు. మాలేగావ్ పేలుడు కేసు తీర్పుపై డింపుల్ యాదవ్ స్పందించారు. ఆధారాలు లేకపోవడంతోనే నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నట్లు కోర్టు పేర్కొందని, ఈ కేసు విషయంలో అనుమానం అలాగే ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిన రాజ్య సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. బీహార్ ఓటర్ల సవరణ జాబితాలో అవకతవకలపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్ సభను స్పీకర్ 2 గంటలకు వాయిదా వేశారు.