క్వీన్ అనుష్క శెట్టి నటించిన యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువి క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ నేపధ్యంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. “డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు రచనలు అద్భుతంగా ఉంటాయి. మా కంపెనీలో ’అరేబియన్ కడలి’ వెబ్ సిరీస్‌కి కథ, మాటలు రాశారు. వేరే కథల గురించి చర్చించుకున్నప్పుడు ఘాటి ఆలోచన చెప్పారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, సంస్కృతిని చూపించే ఆస్కారం వుండటంతో ఘాటీ సినిమాను మొదలుపెట్టాం. ఈ కథ నాయికి ప్రధానంగానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీతో మరో సినిమా చేయాలని ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. ‘ఘాటీ’లో శీలావతి క్యారెక్టర్ అనుష్కకి అన్నివిధాలుగా సరిగ్గా సరిపోతుంది. ఘాటి కథ పూర్తిగా ఫిక్షనల్. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్‌తో స్వీటీ కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ. ఘాటి సినిమా అనుష్క కెరీర్‌లో మరో ఐకానిక్ మూవీ అవుతుంది. ఇందులో చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. దేశిరాజు క్యారెక్టర్‌ని రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభుని ఊహించుకున్నాను. ఈ క్యారెక్టర్‌కి ఆయన పర్ఫెక్ట్. దేశి రాజు చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర. విక్రమ్ ప్రభు అద్భుతంగా నటించారు. ఇక ట్రైలర్‌లో చూసింది కేవలం ఓ రెండు మెతుకులు మాత్రమే. పూర్తి విందు భోజనం సినిమాలో ఉంటుంది. సాయి మాధవ్ ఒక విస్తృతమైన విషయాన్ని చాలా అందంగా రాసేస్తారు. ఆయన మాటలు సూటిగా వుంటాయి. ఘాటిలో మాటలు కూడా ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి. ఇందులో మూడు పాటలు రాశాను. స్వేచ్ఛ పథకాలన్నీ ఒకప్పటి బందీలే, సందేశాలన్నీ తప్పుల నుంచి నేర్చిన పాఠాలే.. అనే పల్లవి రాశాను. అది సాయి మాధవ్‌కి నచ్చి దాన్ని డైలాగ్‌గా మార్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి దగ్గర చేసిన శిష్యరికం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల కలం విదిలించా”అని అన్నారు.