హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నంచిన పీరియాడిక్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా కొంత భాగం క్రిష్ జాగర్లమూడి (Director Krish) దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. మిగితా సినిమాను ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. అయితే హరిహర వీరమల్లు విడుదలకు ముందు క్రిష్ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.
‘‘ఈ వీరమల్లు ఇప్పుడు ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. అది నిశబ్ధంగా కాదు.. ఓ గొప్ప అశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకువస్తాడు. ఈ చిత్రం ఇద్దరు లెజెండ్స్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. వాళ్లు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఎందరికో స్పూర్తి. అందులో ఒకరు పవన్‌కళ్యాణ్. ఓ అసాధారణమైన శక్తికి రూపం వస్తే అది పవన్. నిత్యం రగిలే అగ్నికణం ఆయన. హరిహర వీరమల్లుకి ప్రాణం పోసింది ఆయనే. ఆయన ఈ చిత్రానికి వెన్నుముక’’ అని క్రిష్ (Director Krish) పేర్కొన్నారు.
‘‘ఇంకో వ్యక్తి నిర్మాత ఎఎం రత్నం. భారతీయ సినీ రంగంలో తనకంటూ గొప్ప అనుభవాలను పోగేసుకున్న శిల్పి. ఎంతో విశ్వాసంతో ఈ సినిమాను నిర్మించారు. ఇలాంటి సామర్థ్యం, పట్టుదల చాలా అరుదుగా ఉంటాయి. ఆయన అచంచలమైన నమ్మకం వల్ల ఇది సాధ్యమైంది. నాకెంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్టుల్లో ఈ సినిమా ఒకటి. ఎన్నో జ్ఞాపకాల్ని ఇచ్చింది. దర్శకుడిగ మాత్రమే కాకుండా.. కథను రూపొందించడంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’’ అని క్రిష్ రాసుకొచ్చారు.