నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పరిచయ వీడియో అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన నిమిషాల్లోనే అది వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో శూర్ఫణఖ పాత్రలో 15 ఏళ్ల అమ్మాయి (Dishita Sehgal) కనిపించనుందనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ఈ సినిమాలో శూర్ఫణఖ పాత్ర కోసం ముందుగా ప్రియాంక చోప్రాను సంప్రదించగా.. ఆమె బిజీగా ఉండటంతో అవకాశాన్ని వదిలేసుకుందట. ఆ తర్వాత ఆ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు టాక్. అయితే బాల శూర్ఫణఖ పాత్ర కోసం 15 ఏళ్ల దిశిత సెగల్‌ను (Dishita Sehgal) చిత్ర యూనిట్ ఎంపిక చేసినట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ఆడిషన్‌తో పాటు లుక్ టెస్ట్ కూడా జరిగిపోయిందట. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారనే టాక్. దిశిత నాలుగేళ్ల వయస్సులోనే వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. బేబీ సినిమాలో అక్షయ్ కుమార్ కూతురిగా, డియర్ జిందగీలో చిన్నారి ఆలియా భట్‌గా నటించింది. వార్, హిందీ మీడియం సినిమాల్లో కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు రామయణకు ఎంపికైందిని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. దిశిత కెరీర్ ఓ మలుపు తిరిగినట్లే అని నెటిజన్లు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రవి దూబే లక్ష్మణుడిగా, రావణుడి పాత్రలో యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. నమిత్ మల్హోత్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నామని నమిత్ తెలిపారు. ఈ సినిమా తొలి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.