Saturday, May 10, 2025

ఆపదవేళ.. అన్నీ అందేలా…

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకల స్థావరాలను నేలమట్టం చేయాలని ఆపరేషన్ సిందూర్‌ను భారత్ అప్రతిహతంగా చేపట్టగా, పాకిస్థాన్ మాత్రం సుదీర్ఘ పోరును కోరుకున్నట్టయితే దానిని ఎదుర్కోడానికి భారత్ సర్వదా సిద్ధంగానే ఉంది. ఆర్థికంగా, లాజిస్టిక్‌గా సౌకర్యవంతంగానే ఉంది. అతి ముఖ్యమైన చమురు, గ్యాస్ దిగుమతులు 30 నెలలపాటు కొనసాగించడానికి అలాగే ఇతర ముఖ్యమైన దిగుమతులు ఏడాదిపాటు కొనసాగించడానికి కావలసి విదేశీ మారక నిల్వలు భారత్ వద్ద ఉన్నాయి.ఇక ఆహార భద్రతకు సంబంధించి గోధుమలు, వరి నిల్వలు ప్రభుత్వ సౌకర్యవంతమైన స్థాయికి మించి ఉన్నాయి. దేశంలో పటిష్టమైన, వైవిధ్యమైన ఉత్పాదక రంగం నెలకొని ఉంది. అభివృద్ధి రేటు పైస్థాయిలో ఉండగా, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. కానీ ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు. సంఘర్షణలో ఎదురయ్యే అన్ని పరిస్థితులకు బడ్జెట్ వేసుకోక తప్పదు. అంటే కీలకమైన మౌలిక సౌకర్యాలపై ఓ కన్నేసి ఉంచాలి.

అందువల్ల ఆకస్మిక ప్రణాళికలను ఎప్పటికప్పుడు రూపొందించుకోవడం ముఖ్యం. ఈ నేపథ్యంలో నిత్యావసరాల సరఫరా వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ జాతీయ స్థాయిలో ఎంతవరకు మనం సన్నద్ధంగా ఉన్నామో వివిధ మంత్రిత్వ శాఖల సెక్రటరీలతో గురువారం సమీక్షించారు. భారీ సంఘర్షణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిత్యావసరాలు, ఇతర ముఖ్యమైన సేవలు ప్రజలకు అందేలా గట్టిగా నమ్మకం కల్పించేలా పనిచేయాలన్నారు. సరఫరా వ్యవస్థ ప్రధానంగా ప్రైవేట్ రంగంపైనే ఆధారపడినప్పటికీ, కలుపుకుని పోవడం కీలకం. జాతీయ ప్రయోజనాల విషయంలో భారతీయులు వెనుకంజవేయరన్న విశ్వాసం ఉన్నప్పటికీ, వీటన్నిటినీ ఒక మార్గంలో ముందుకు తీసుకెళ్లడం ఒక సవాలు. ఈ పరిస్థితుల్లో భారత్‌పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో దేశం గోధుమ, చక్కెర, వంటనూనెలు నిల్వలు కావలసినంత సమకూర్చుకుంది. ఇవి అత్యవసర సమయంలో అవసరాలకు సరిపోతాయి.

ముడి చమురు నిల్వలు కూడా తగినంత స్థాయిలో ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం 70 రోజులకు సరిపడే ముడి చమురు, 74 రోజులకు సరిపడే పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. దేశం మొత్తం మీద వినియోగానికి 60 నుంచి 64 రోజులకు సరిపడే ఇంధనం నిల్వలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కలిగి ఉన్నాయి. మరో తొమ్మిది రోజులకు అదనంగా కావలసిన ఇంధనాన్ని ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వు నిల్వ చేసింది. ఇంధనం ధరలు తగ్గుముఖంలో ఉండడంతో కొనుగోళ్లు వేగవంతం చేయడానికి ఒఎంసి ప్రయత్నిస్తోంది. ధరలు నిలకడగా లేనప్పుడు ఈ విధంగా కొనుగోళ్లు చేయడం పరిపాటిగా వస్తోంది. ప్రస్తుతం చాలినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని సహజవాయు మంత్రిత్వశాఖకు చెందిన అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముడిచమురును సరఫరా చేసే దేశాలు అందుబాటులో ఉండడంతో ముడి చమురు నిల్వలు లోటు లేకుండా ఉండడం గమనార్హం. 2025 కు ముందు 27 దేశాలనుంచి చమురు నిల్వలను దిగుమతి చేసుకోగా, 2025 మొదట్లో 40 దేశాల నుంచి ముడిచమురు నిల్వలను దిగుమతి చేసుకుంది.

ఈ ఏడాది జనవరిలో 1.48 శాతం వరకు దిగుమతులు తగ్గినప్పటికీ, ఫిబ్రవరి, మార్చి వచ్చే సరికి 6.6 శాతం నుంచి 9.04 శాతం వరకు దిగుమతులు పెరిగాయి. ప్రత్యేక ప్రయోజనం కల్పించే వెహికల్ ఐఎస్‌ఆర్‌పిఎల్, మంత్రిత్వశాఖ కింది ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు దేశం మొత్తం మీద మూడు ప్రాంతాల్లో ముడిచమురు నిల్వలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కర్ణాటకలోని మంగలూరు, పాడూరు (ఉడిపి సమీపాన) ప్రాంతాల్లో ఈ నిల్వలు ఉంటున్నాయి. అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ ప్రమాణాల ప్రకారం సభ్యదేశాలు 90 రోజుల పాటు చేసుకున్న దిగుమతులకు సమానంగా ముడిచమురు నిల్వలను ఉంచుకోవచ్చు. ఇక ఆహార ధాన్యాల విషయాన్ని పరిశీలిస్తే ఆహార మంత్రిత్వశాఖ డేటా ప్రకారం ఏప్రిల్ 27 నాటికి దేశంలో మొత్తం 66.17 మిలియన్ టన్నుల గోధుమ, వరి ధాన్యాల నిల్వలు గిడ్డంగుల్లో ఉన్నాయి. 202324 లో 52 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేశారు. సూక్ష్మంగా చెప్పాలంటే గోధుమ, వరి నిల్వలు ఏడాది కాలానికి సరిపడే ఉన్నాయి.

ఈ ఏడాది మే 1 నాటికి చక్కెర ఉత్పత్తి గత ఏడాది కన్నా 18 శాతం తగ్గినప్పటికీ, రానున్న సీజన్‌లో అక్టోబర్ నాటికి చక్కెర ఉత్పత్తి నిల్వలు భారీగా అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. దేశం కొత్త చక్కెర సీజన్‌ను 202526 (అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు) దాదాపు 5.4 మిలియన్ టన్నుల చక్కెర నిల్వతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. అంటే రెండు నెలల వినియోగం కన్నా ఎక్కువ. ఇక పప్పు ధాన్యాల నిల్వలను పరిశీలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి 1.8 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి. సాధారణంగా 3.5 మిలియన్ టన్నుల వరకు నిల్వలు ఉంటాయి.అయితే పెసలు, బఠాణీలు అందుబాటులో ఉన్నాయి. కొత్త శనగ పంట ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చింది. అందువల్ల రానున్న నెలల్లో సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని పప్పుదినుసుల వ్యాపారులు భావిస్తున్నారు. ఇక ఖాద్య తైలాల నిల్వలు 1.6 మిలియన్ టన్నుల నుంచి 1.7 మిలియన్ టన్నుల వరకు ఉన్నాయి. వచ్చే 25 రోజుల వరకు వీటి సరఫరాకు ఎలాంటి ఢోకా ఉండదు. సాధారణంగా ఒక నెలకు సరిపడే నిల్వలను ముందుగానే జాగ్రత్త చేసి ఉంచుకుంటామని, కానీ ఇటీవల కాలంలో దిగుమతులు తగ్గాయని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News