ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన తెలుగుతేజం కోనేరు హంపితో జరిగిన ఫైనల్లో దివ్య 1.5, 0.5 పాయింట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. సోమవారం టైబ్రేకర్‌లో దివ్య జయభేరి మోగించింది. ఇద్దరి మధ్య జరిగిన తొలి రెండు రౌండ్‌లు డ్రాగా ముగిసాయి. దీంతో ఫలితం కోసం టైబ్రేకర్ అనివార్యమైంది. ఇందులో అసాధారణ ఆటను కనబరిచిన మహారాష్ట్ర సంచలనం దివ్య చారిత్రక విజయాన్ని అందుకుంది. తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా, రెండో టైబ్రేకర్‌లో దివ్య 75 ఎత్తుల్లో సీనియర్ క్రీడాకారిణి కోనేరు హంపిని ఓడించింది.
భారత్ మహిళల ఫిడె ప్రపంచ చెస్ టైటిల్‌ను గెలువడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్‌లు ఫైనల్‌కు చేరడంతో భారత్‌కు ప్రపంచ చెస్ కిరీటం ముందే ఖాయమైంది. అయితే ఫైనల్లో చిరస్మరణీయ ప్రతిభను కనబరిచిన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరానికి చెందిన 19 ఏళ్ల దివ్య జార్బియా వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో అసాధారణ ఆటతో విశ్వవిజేతగా నిలిచింది. మరోవైపు ఫైనల్లో గెలిచి టైటిల్ సాధించాలని భావించిన భారత చెస్ స్టార్ హంపికి నిరాశే మిగిలింది. తుది పోరులో హంపి అసాధారణ ఆటను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది. చివరి వరకు నిలకడైన ఆటతో అలరించిన దివ్య ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
అంచనాలు లేకుండానే..
బాటుమిలో జరిగిన మహిళల చెస్ ప్రపంచ కప్‌లో దివ్య ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. ఈ టోర్నమెంట్‌కు ముందు దివ్య సీనియర్ విభాగంలో ఆడిన టోర్నీలు కూడా తక్కువే. అంతేగాక టోర్నీ ఫైనల్స్‌కు ముందు దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. మాస్టర్ హోదాతోనే దివ్యవిశ్వకప్ బరిలోకి దిగింది. ఈ పరిస్థితుల్లో దివ్య విశ్వవిజేతగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. హంపితో సహా ప్రపంచంలోని దిగ్గజ గ్రాండ్ మాస్టర్లు బరిలో ఉండడంతో వీరిలో ఎవరో ఒకరు టైటిల్ సాధిస్తారని అందదూ ఊహించారు.
కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ భారత్‌కు చెందిన యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ విశ్వవిజేతగా నిలవడం విశేషం. ప్రపంచ చెస్ టైటిల్‌తో దివ్య సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ప్రపంచ మహిళల చెస్‌లో భారత్ ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. ఈ టోర్నీలో దివ్య ఫైనల్‌కు చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. హంపి కూడా సెమీస్‌లో గెలిచి దివ్య సరసన నిలిచింది. తాజాగా ఫైనల్లో దివ్య తన కంటే ఎంతో సీనియర్ అయిన హంపిని మట్టికరిపించి ఔరా అనిపించింది. ఈ టైటిల్‌తో దివ్య భారత మహిళల చెస్‌లో సరికొత్త ఆధ్యాయానికి తెరలేపిందనే చెప్పాలి.